సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బన్నీ ఎవరో తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ నేషనల్ మీడియా నిర్వహించిన 'ది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్' అనే సెషన్ లో పాల్గొన్న ఆయన తను ఫస్ట్ షూట్ చేసిన సెలబ్రిటీ వెడ్డింగ్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలదేనని వెల్లడించారు. ఈ సందర్భంగా అప్పట్లో తనకు అల్లు అర్జున్ అంటే స్టార్ హీరో అని తెలుసని, కానీ ఆయనను ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారని తెలియదని చెప్పారు.
బన్నీ ఎవరో తెలియకుండానే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా...
జోసెఫ్ తాజా ఈవెంట్ లో తనకు అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల పెళ్లి ఈవెంట్ ను తన కెమెరాలో బంధించే అవకాశం ఎలా వచ్చిందో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ "నా ఫస్ట్ సెలబ్రిటీ మ్యారేజ్ అల్లు అర్జున్ - స్నేహాలది. గతంలో నేను ఒక చిన్న క్రియేటివ్ ఈవెంట్లో మాట్లాడుతున్న టైంలో, ముందు వరుసలో కొంతమంది తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూర్చున్నారు. వాళ్లలో ఒకరు నా దగ్గరకు వచ్చి మరో రెండు నెలల్లో బన్నీ పెళ్లి చేసుకుంటున్నాడు. మీరు ఆయన పెళ్లి ఫోటోలను తీస్తారా? అని అడిగారు. వెంటనే నేను బన్నీ ఎవరు ? ఇది ఒక ఫన్నీ పేరు అని అన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఆయన నిక్ నేమ్ గురించి తెలియదు. అప్పటిదాకా నాకు అతని పేరు అల్లు అర్జున్ అని, ఒక స్టార్ అని మాత్రమే తెలుసు" అంటూ క్లారిటీ ఇచ్చారు.
Also Read: కయాదు లోహర్ మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ... రెండు ఓటీటీల్లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్
ఒక్క సెలబ్రిటీని కూడా సెలబ్రిటీగా చూడలేదు
ఇక ఇదే ఈవెంట్లో ఒక సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా తాను సెలబ్రిటీలను సెలబ్రిటీగా చూడలేదని, వాళ్లు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో దగ్గరగా చూడగలిగానని వెల్లడించారు. జోసెఫ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ "తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఒక సెలబ్రిటీ కపుల్ వెడ్డింగ్ తో ఫోటోగ్రఫీని ప్రారంభించడం ఒక వరం లాంటిది. అయితే ఈ కెరీర్ ని మొదలుపెట్టి 15 సంవత్సరాలు పూర్తయింది. కానీ నేను ఎప్పుడూ ఒక సెలబ్రిటీని సెలబ్రిటీగా చూడలేదు. వాళ్లు అసలు సెలబ్రిటీల్లా ప్రవర్తించరు. ఎందుకంటే నేను వారి వ్యక్తిగత కార్యక్రమాలలో ఫోటోలు తీసే పని మీదే ఉంటాను. అదేమీ కమర్షియల్ ప్రమోషన్ కాదు. కాబట్టి నేను వాళ్ళలో మానవీయ కోణాన్ని కూడా చూడగలను. వాళ్లు వ్యక్తిగతంగా ఎలా ఉంటారో నాకు బాగా తెలుస్తుంది" అని అన్నారు.
ఇదిలా ఉండగా మార్చి 6న అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. గురువారం రోజు ఈ జంట 14వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలను స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్, స్నేహ రెడ్డికి ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ ఉన్నారు. ఇక ఇటీవలే 'పుష్ప 2' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.