''సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ (తమిళ చలన చిత్ర పరిశ్రమ)లో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదని నిబంధనలు తీసుకు వచ్చినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అటువంటి నిబంధన తీసుకు వస్తే.... దానిని ముందుగా నేనే ఖండిస్తాను, దాన్ని వ్యతిరేకిస్తాను'' అని ప్రముఖ నటుడు నాజర్ ఓ వీడియో విడుదల చేశారు. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


తమిళసీమ తమిళులకు మాత్రమే అంటే ఎలా? - పవన్
''మన పరిశ్రమ (సినిమాల్లో) లో, మనవాళ్ళు మాత్రమే చేయాలనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని తమిళ చిత్ర పరిశ్రమకు, కోలీవుడ్ పెద్దలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజ్ఞప్తి చేశారు. 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ వేడుక (Bro Movie Pre Release Event)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


తమిళ సినిమా చిత్రీకరణలు తమిళనాడులో మాత్రమే చేయాలని, తమిళ చిత్రాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ తమిళులు అయ్యి ఉండాలని ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) కొత్త నిబంధనలు ప్రతిపాదనలోకి తీసుకు వచ్చింది. ఒకవేళ ఆ నిబంధనలు అతిక్రమించినట్లు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పవన్ విజ్ఞప్తి చేశారు. ఇతర భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు వస్తాయని, మీరూ 'ఆర్ఆర్ఆర్' తీయాలని పవర్ స్టార్ పేర్కొన్నారు. 


పవన్ వ్యాఖ్యలను ఖండించిన నాజర్
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నడిగర్ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు నాజర్ (Actor Nassar) ఖండించారు. అసలు, అటువంటి నిబంధనలు ఎక్కడా లేవని ఆయన వివరించారు. ఇంకా నాజర్ మాట్లాడుతూ ''సినిమా పరిశ్రమకు, కళాకారులకు హద్దులు, సరిహద్దులు ఉండవు. ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల కోసం ఆర్కే సెల్వమణి (RK Selvamani) గారు కొన్ని సూచ‌న‌లు చేశారు. తమిళ సినిమాలు చేస్తున్నప్పుడు... తమిళ సాంకేతిక నిపుణులను పెట్టుకోమని చెప్పారు. అంతే కానీ... ఇతర భాషలకు చెందిన వ్యక్తులు వద్దని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఒక భాష అని ఏం లేదు. ప్రతి చిత్ర పరిశ్రమలో, అన్నీ చిత్రాలూ కూడా పాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. ప్రేక్షకులు ఓటీటీలకు ఎక్కువ అలవాటు పడ్డారు. ఓటీటీ వేదికల వినియోగం ఎక్కువగా ఉంది. ఇటువంటి సమయంలో అటువంటి నిబంధనలు ఎవరు తీసుకు వస్తారు? ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. ఎంతగానో ఆదరించింది'' అని అన్నారు.


Also Read : రూ. 150 కోట్ల షేర్ గ్యారెంటీ 'బ్రో'... పవన్ కళ్యాణ్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ఎంతంటే?


ఎస్వీఆర్, సావిత్రి తమిళులే అనుకున్నా! - నాజర్
ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారు, వాణీశ్రీ గారు, శారద అమ్మ గారు ఇలా చాలా మంది నటీనటులు తమిళులే అని అనుకున్నానని, చాలా కాలం తర్వాత తనకు వాళ్లది ఆంధ్రా అని తెలిసిందని నాజర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురు చూస్తోంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్‌' కంటే పెద్ద సినిమాలను మనం అందరం కలిసి తీద్దాం'' అని అన్నారు.


Also Read అనుష్క సినిమా వాయిదా - ప్రభాస్ కజిన్‌కు తిట్లు తప్పవా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial