Pawan Kalyan's Ustaad Bhagat Singh Movie Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస గుడ్ న్యూస్‌లు అందుతున్నాయి. అవెయిటెడ్ మూవీస్‌లో ఒకటైన 'ఉస్తాద్ భగత్ సింగ్'పై బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పునఃప్రారంభం కానున్నట్లు మూవీ టీం తెలిపింది.

చాలా ఏళ్లు గుర్తుంటుంది

పవన్‌కు సంబంధించి బెస్ట్ రోల్ సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధం కావాలంటూ మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'ఉస్తాద్ భగత్ సింగ్ చాలా ఏళ్లు గుర్తుండిపోయే మూవీ. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి.' అంటూ పేర్కొంది. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆ పోస్టర్ డిజైన్ చేయగా.. డైరెక్టర్ హరీష్ శంకర్ దీన్ని షేర్ చేశారు. 'ఇక మొదలెడదాం.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా

పవన్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరోసారి వీరి కాంబో రిపీట్ కానుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఆయన సరసన బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

పవన్.. గబ్బర్ సింగ్, బీమ్లా నాయక్ వంటి సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గూస్ బంప్స్ తెప్పించారు. ఇప్పుడు ఈ మూవీలోనూ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండడంతో బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

పవన్ రెమ్యూనరేషన్‌ ఎంతంటే? 

ఈ మూవీ కోసం పవన్‌కు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ జర్నలిస్ట్ ఇటీవల చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ రూ.170 కోట్లు పవన్‌కు ఆఫర్ చేశారట. పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోలు సైతం కళ్లు చెదిరేలా ఈ అమౌంట్ ఉండడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. 'గబ్బర్ సింగ్' భారీ సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. దీంతో పవన్‌కు అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారంటూ ప్రచారం సాగుతోంది.

ఎలక్షన్ క్యాంపెయిన్, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా పాలనలో ఆయన బిజీగా మారిన తర్వాత సినిమాలు చేయలేదు. అంతకు ముందు కమిట్ అయిన సినిమాలనే ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'హరిహర వీరమల్లు' పూర్తి చేయగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక 'ఓజీ' సినిమాను సైతం ఆయన త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.