పవర్ స్టార్ - ప్రస్తుత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వల్ల 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie) చిత్రీకరణ ఆలస్యమైందని జరిగిన ప్రచారంలో నిజం లేదని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు. వాళ్ళిద్దరి కలయికలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాలోని మొదటి పాట 'దేఖ్ లేంగే సాలా' పాటను రాజమండ్రిలో విడుదల చేశారు. పాటతో పాటు సినిమా ఆలస్యానికి గల కారణాలను ఆయన వివరించారు.

Continues below advertisement

రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేసిన పవన్ కళ్యాణ్!పవన్ కళ్యాణ్ తమను ఊపిరి ఆడనివ్వకుండా చిత్రీకరణ చేశారని హరీష్ శంకర్ తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఒక వైపు బాధ్యతలు నిర్వర్తిస్తూ మరో వైపు చిత్రీకరణ చేశారని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''కేబినెట్ సమావేశం ఉందని ఉదయాన్నే కళ్యాణ్ గారు విజయవాడ వెళ్ళిపోయేవారు. రాబోయే రెండు రోజులు చిత్రీకరణ ఉండని అనుకునేవాళ్ళం. కానీ, రాత్రికి మళ్ళీ హైదరాబాద్ వచ్చి చిత్రీకరణ చేసేవారు. ఉదయమంతా ప్రజాసేవలో ఉండి... రాత్రి ఫ్లయిట్‌లో హైదరాబాద్ వచ్చి తెల్లవారుజామున మూడు నాలుగు గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ మంగళగిరి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలా రోజుకు 18 నుంచి 20 గంటలు కళ్యాణ్ గారు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఆయన ప్రాణం పెట్టారు. మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా'' అని చెప్పారు. కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రయత్నంలో లోపం ఉండకూడదని చెబుతున్నారని, ఆయన ప్రయత్నంలో లోపం లేదు కాబట్టే అపజయాన్ని చూసి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారని హరీష్ శంకర్ అన్నారు.

అభిమానులంతా మళ్ళీ మళ్ళీ చూసే సినిమా చేయాలని!''పవన్ కళ్యాణ్ గారి వల్ల 'ఉస్తాద్ భగత్ సింగ్' అసలు ఆలస్యం కాలేదు. సినిమా ప్రయాణం గురించి వివరంగా చెప్పాలంటే... మొదట కాలేజీ నేపథ్యంలో ఓ ప్రేమ కథ చేయాలనుకున్నా. కానీ, అభిమానులు 'గబ్బర్ సింగ్' లాంటి సినిమా కావాలని కోరడంతో సందిగ్ధంలో పడిపోయా. అదే సమయంలో కరోనా వచ్చింది. ఆ టైంలో నేను కొంచెం డిప్రెషన్‌లో పడ్డా. పవర్ స్టార్ హీరోగా ఏ కథ చేయాలనే సందిగ్ధంలో నా వల్ల కొంచెం సమయం వృథా అయ్యింది. ఓ రీమేక్ అనుకొని అది కూడా పక్కన పెట్టాం. ఆలస్యమైనా పర్లేదని, అభిమానులందరూ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా చేయాలని మా బృందం అంతా కలిసి పని చేశాం. నిజానికి పవన్ కళ్యాణ్ గారి వల్లే చిత్రీకరణ త్వరగా పూర్తయింది'' అని హరీష్ శంకర్ వివరించారు.

Continues below advertisement

Also ReadMowgli 2025 Review - 'మోగ్లీ 2025' రివ్యూ: 'కలర్ ఫోటో' దర్శకుడి కొత్త సినిమా - సుమ కనకాల తనయుడు రోషన్‌కు హిట్ వస్తుందా?

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని హరీష్ శంకర్ చెప్పారు. 'ఆనందం' చూసి ఆయనతో జీవితంలో ఒక్కసారైనా పని చేయాలని కోరుకున్నానని, కానీ దేవుడు మూడుసార్లు అవకాశం ఇచ్చాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికీ మొదటి సినిమాకు పని చేసినట్టు దేవి పని చేస్తారని హరీష్ తెలిపారు. అడిగిన దాని కంటే ఎక్కువ ఇచ్చే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని గారు, రవిశంకర్ యలమంచిలి గారు అని చెప్పారు

Also ReadAkhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?