Mowgli 2025 Review - 'మోగ్లీ 2025' రివ్యూ: 'కలర్ ఫోటో' దర్శకుడి కొత్త సినిమా - సుమ కనకాల తనయుడు రోషన్‌కు హిట్ వస్తుందా?
Mowgli Review Telugu: సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'మోగ్లీ 2025'. హీరోగా అతని రెండో చిత్రమిది. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
సందీప్ రాజ్
రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్, సాక్షి మడోల్కర్, హర్ష చెముడు తదితరులు
Roshan Kanakala's Mowgli 2025 Movie Review In Telugu: 'కలర్ ఫోటో'కు విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. ఉత్తమ చిత్రం (తెలుగు విభాగంలో)గా జాతీయ పురస్కారం లభించింది. ఆ సినిమాకు సందీప్ రాజ్ దర్శకుడు. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'మోగ్లీ 2025'. ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala)కు హీరోగా రెండో చిత్రమిది. పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ యాంటీ హీరో రోల్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Mowgli 2025 Story): మోగ్లీ అలియాస్ మురళీకృష్ణ (రోషన్ కనకాల) అనాథ. బాల్యంలో జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులు మరణిస్తారు. అతని తండ్రి పోలీస్. అందుకని ఎప్పటికైనా తండ్రిలా పోలీస్ కావాలనేది మోగ్లీ కల. అడవిలో ఉండే అతను సినిమాలకు లొకేషన్ కో ఆర్డినేటర్‌గా పని చేస్తుంటాడు.
చిత్రీకరణకు వచ్చిన ఓ బృందంలోని డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్)తో ప్రేమలో పడతాడు. అమ్మాయి మూగ - చెవిటి అని తెలిసీ ప్రేమిస్తాడు. అయితే జాస్మిన్ మీద పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) కన్ను పడుతుంది. ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలని అనుకుంటాడు. ఆమెను మోగ్లీ ప్రేమిస్తున్నాడని తెలిసి అతడిపై తప్పుడు కేసులు బనాయిస్తాడు. అంతకు ముందు జాస్మిన్ - మోగ్లీలను విడదీయడానికి ప్లాన్ వేస్తారు ఇంకొకరు. తనకు ఎదురైన అడ్డంకులు దాటుకుని ప్రేమను గెలుచుకోవడానికి మోగ్లీ ఎటువంటి యుద్ధం చేశాడు? చివరకు జాస్మిన్, మోగ్లీ ఒక్కటి అయ్యారా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణ (Mowgli Telugu Movie Review): 'మోగ్లీ'కి ముందు దర్శకుడిగా సందీప్ రాజ్ అనుభవం ఒక్క సినిమా మాత్రమే. కానీ, సినిమాల్లోకి రాక ముందు నుంచి రచయితగా షార్ట్ ఫిలిమ్స్ చేశారు. వెబ్ సిరీస్, సినిమాలకూ రాశారు. సమాజం, భగవంతునిపై ఆయనకు అంటూ స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. 'మోగ్లీ 2025'లోనూ అవి కనిపించాయి, వినిపించాయి. అయితే అవి ఫ్లోలో కాకుండా కొన్ని సన్నివేశాల్లో ఫోర్స్డ్‌గా అనిపించాయి.
'మోగ్లీ 2025'ని సందీప్ రాజ్ గొప్ప ప్రేమ కథగా చెప్పారు. నిజానికి ఆ ప్రేమ కథలో అంత గొప్పదనం లేదు. అటువంటి ప్రేమలు ఇంతకు ముందు చూశాం. ఇక్కడ అమ్మాయి మూగ, చెవిటి కావడం ఒక్కటే మార్పు. అది తెలిసీ హీరో ప్రేమించడం మలుపు. 'మోగ్లీ 2025'లో గొప్పదనం పతాక సన్నివేశాల్లో ఉంది. ప్రతినాయకుడి మరణంలో ఉంది. సాధారణ ప్రేమ కథను మించి క్లైమాక్స్ తీసిన తీరు బావుంది. మూగ జీవి చేతిలో మరణం - ఈ పాయింట్ బావుంది. అయితే... 'మోగ్లీ 2025'లో అదొక్కటే బావుంది. అంతకు ముందు ప్రేమలో గానీ, ప్రతినాయకుడి పాత్ర చిత్రణలో గానీ కొత్తదనం లేదా గొప్పదనం చూపించలేదు. మంచి క్లైమాక్స్ రాసిన సందీప్ రాజ్... 'పొట్ట - వెళ్లడం లేదు, జుట్టు - వెళ్ళిపోతుంది' వంటి కామెడీ రాయడం ఎందుకు? వాట్సాప్ ఫార్వర్డ్ జోక్స్ ఎక్స్‌టెన్షన్‌లు ఎందుకు?
దర్శక రచయితగా సందీప్ రాజ్ తన ఒరిజినాలిటీ చూపించాల్సిన అవసరం చాలా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ తీసేటప్పుడు హీరోల రిఫరెన్సులు, సూపర్ హిట్ సీన్స్ రీ క్రియేషన్స్ ఓకే. సినిమాకు వచ్చినప్పుడు కొత్తదనం కచ్చితంగా చూపించాలి. అందులోనూ నలుగురిలో ఒకరిగా కాకుండా దర్శక రచయితగా తన ప్రత్యేకత చూపించాలంటే! 'మోగ్లీ 2025' కథపై జయం ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఎంత పార్వతీపురం ఏజెన్సీ అన్నట్టు చూపించినా హీరో అడివిలో ఉంటే యూత్, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు? ప్రభాస్ అభిమానిగా హీరోని చూపించడం ఓకే. 'ఛత్రపతి'లో యాక్షన్ సీన్ గుర్తు చేసేలా క్లైమాక్స్ డిజైన్ చేయడం వల్ల గానీ, ఈ కథకు సినిమా నేపథ్యం తీసుకోవడం వల్ల గానీ ప్రయోజనం అసలు చేకూరలేదు. రొటీన్ కథ, సన్నివేశాలు, క్యారెక్టర్లు వల్ల సినిమాలో సాగదీత వ్యవహారం ఎక్కువైంది. రామ మారుతి ఎం కెమెరా వర్క్ బావుంది. అటవీ నేపథ్యంలో సన్నివేశాలను బాగా తీశారు. కాల భైరవ సంగీతంలో మెరుపులు లేవు. ఒక్క 'సయ్యారే...' పాట తప్ప. నేపథ్య సంగీతం కూడా ఇంపాక్ట్ చూపించలేదు.
Also Read: Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?
హీరోగా రోషన్ కనకాల రెండో చిత్రమిది. ఫ్రెండ్షిప్ బేస్డ్ సన్నివేశాల్లో హర్ష చెముడు, రోషన్ నటన సహజంగా ఉంది. ఎమోషనల్ సన్నివేశాల్లో పర్వాలేదు. కానీ ఇంకా పరిణితి చెందాలి. మొత్తం మీద రెండో సినిమాతోనూ రోషన్ పాస్ మార్క్స్ స్కోర్ చేశారు. హీరోయిన్ సాక్షి మడోల్కర్ మొదటి చిత్రమిది. లుక్స్ వరకు ఓకే. నటనలో ఇంప్రూవ్ అవ్వాలి. నటుడిగా బండి సరోజ్ కుమార్ ట్యాలెంట్ అందరికీ తెలుసు. అయితే ఆయన పాత్రకు ప్రారంభంలో ఇచ్చిన ఎలివేషన్ చివరి వరకు కంటిన్యూ కాలేదు. రొటీన్ అయ్యింది. కానీ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ తన ప్రజెన్స్, నటనతో బండి సరోజ్ కుమార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అందులో మరో సందేహం అవసరం లేదు. హర్ష చెముడు మరోసారి తన ట్యాలెంట్ చూపించారు. ఆయన యాక్షన్ చేసిన ప్రతిసారీ విజిల్స్ పడతాయి. కామెడీతోనూ నవ్వించారు. ఏడిపించారు.
దర్శక రచయితగా సందీప్ రాజ్ మెరుపులు 'మోగ్లీ 2025'లో ఉన్నాయి. అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టేలా లేదు. ఆయన ఆలోచనలు కొన్ని బావున్నాయి. కానీ, కథలో కొత్తదనం లేదు. క్లైమాక్స్ & కామెడీ సీన్స్ కొన్ని మాత్రమే మెప్పిస్తాయి. బండి సరోజ్ కుమార్ నటన కోసం ఆయన ఫ్యాన్స్ ఒక్కసారి వెళ్లొచ్చు.