పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దృష్టి ఇప్పుడు సినిమాల మీద లేదు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడంలో బిజీగా ఉన్నారు. అందుకని, ఆయన నుంచి సినిమా అప్డేట్లు ఆశించడం మానేశారు జన సైనికులు, ఇంకా అభిమానులు. వాళ్లకు సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman) ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.


'ఓజీ'లో రమణ గోగులతో ఓ పాట
పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రమణ గోగుల (Ramana Gogula)ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ల కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ చార్ట్ బస్టర్ అయింది. పవన్ కోసం రమణ గోగుల పాడిన ప్రతి పాట అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించింది. అయితే కొన్నాళ్ళుగా రమణ గోగుల సంగీతానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఓ పాట పాడారు. ఇప్పుడు ఆయన చేత పవన్ సినిమా కోసం పాడించాలని తమన్ ఆలోచిస్తున్నారు. 


''రమణ గోగుల గారితో 'ఓజీ' సినిమాలో ఒక పాట పాడించాలని చూస్తున్నాను'' అని తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ చెప్పారు.


అకిరా నందన్ గురించి ఏం చెప్పారంటే?
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ (Akira Nandan) 'ఓజీ'లో నటిస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అటువంటిది ఏమీ లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ వార్త గురించి సినిమా యూనిట్ ఏమి స్పందించలేదు. అయితే... అకిరాను ఈ సినిమాలోకి తీసుకురావడానికి తమన్ ట్రై చేస్తున్నారు. అది నటుడిగా కాదు... పియానో ప్లేయర్ గా!


అకిరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడని ఆడియన్స్ అందరికీ తెలుసు. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఓ వేడుకలో అకిరా పియానో ప్లే చేసిన వీడియో ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. ఇప్పుడు అతని చేత 'ఓజీ' కోసం పియానో ప్లే చేయించాలని తమన్ ప్లాన్ చేస్తున్నారు.


''ఓజీ కోసం అకిరాను పిలుస్తాను. అకిరా నందన్ చేతి వేళ్లు చాలా పెద్దగా ఉంటాయి. పియానో ప్లే చేయడానికి పర్ఫెక్ట్ పర్సన్. ఇంతకు ముందు రెండు నెలల పాటు నాతో అకిరా పని చేశాడు.‌ 'ఓజీ'లో కూడా పని చేయమని అడుగుతాను'' అని తమన్ చెప్పారు.


Also Read: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్



ఇప్పుడు 'ఓజీ' గురించి తాను ఏం మాట్లాడినా వెంటనే డిప్యూటీ సీఎం దగ్గరకు చేరుతుందని, అందుకే జాగ్రత్తగా మాట్లాడుతున్నానని తమన్ తెలిపారు. సెప్టెంబర్ 2న పాట, పోస్టర్ రిలీజ్ చేయాలనుకున్నా కానీ వరదల ప్రభావంతో ప్రజలు బాధపడుతున్నారు కనుక ఇప్పుడు వద్దని పవన్ చెప్పడంతో ఆగిపోయామన్నారు. జనవరి నుంచి 'ఓజీ' అప్డేట్లు ఇస్తామని తెలిపారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ఇంత వరకు ఇండియాలో ఏ సినిమాకూ రానటువంటి ఓపెనింగ్ 'ఓజీ'కి వస్తాయిని తమన్ ధీమాగా చెప్పారు. ఇప్పుడు పవన్ గారిని కలవడానికి చాలా కష్టపడుతున్నామని, ఇక ఈ సినిమాలో ఆయనతో పాటలు పాడించడం ఏమిటని సరదాగా నవ్వేశారు.


Also Read'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?