వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల మధ్య గొడవ జరిగింది. అదీ థియేటర్‌లో! అసలు, ఈ గొడవకు కారణం ఏమిటి? ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే... 


ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో... 'యాత్ర 2' షోలో!
వైయస్సార్ మరణం నుంచి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన పరిణామాల సమాహారమే 'యాత్ర 2'. ఈ సినిమాలో జనసేనాని పవన్ ప్రస్తావన లేదు. ఆయన క్యారెక్టర్ కూడా లేదు. కానీ, ఒక్క చోట పరోక్షంగా జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ బదులు 'యాత్ర 2'లో తెలుగు నాడు పార్టీ అని ప్రస్తావించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబుగా హిందీ, మరాఠీ చిత్రాల దర్శకుడు & నటుడు మహేష్ మంజ్రేకర్ నటించారు. అంటే... నారా చంద్రబాబు నాయుడు అన్నమాట. 


ఓ సన్నివేశంలో... 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 'తలాతోకా లేని కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఒక్క శాతం ఓటు తేడాతో అధికారం వచ్చింది' అని మహేష్ మంజ్రేకర్ చెబుతారు. ఆ తలాతోకా లేని పార్టీ జనసేన పార్టీ అని థియేటర్లలో ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపించాయి. ఆ కామెంట్స్ వల్ల గొడవ జరిగిందా? లేదంటే మరొక కారణం ఏమైనా ఉందా? అనేది తెలియదు. కానీ, భాగ్య నగరం నడిబొడ్డున ఉన్న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2లో పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ అభిమానుల మధ్య గొడవ జరిగింది.


పోలీసుల జోక్యం... 20 మంది వరకు అరెస్ట్!
Fans war in Yatra 2 theatre: 'యాత్ర 2' ప్రదర్శన మధ్యలో గొడవ జరగడంతో ప్రసాద్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఖాకీలు 20 మంది వరకు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందింది. అభిమానుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: యాత్ర 2 రివ్యూ: వైఎస్ జగన్ జైత్రయాత్ర - సినిమాగా చూస్తే ఎలా ఉందంటే?






'యాత్ర 2' సినిమా విషయానికి వస్తే... వైయస్సార్ పాత్రలో మరోసారి మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి నటించారు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. వైఎస్ భారతిగా కేతకి నారాయణ్, విజయమ్మగా ఆశ్రిత వేముగంటి, సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ నటించారు. ఇంకా ఇతర కీలక పాత్రలో శుభలేఖ సుధాకర్, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కిషోర్ కుమార్ పొలిమేర తదితరులు కనిపించారు. జగన్ అభిమానులకు సినిమా విపరీతంగా నచ్చుతుందని విమర్శకులు తెలిపారు.


Also Read: క్లైమాక్స్‌లో రియల్ జగన్ ఎంట్రీ - 'యాత్ర 2'పై ఆడియన్స్ ఏమంటున్నారంటే?