YS Jagan Mohan Reddy's political biography film Yatra 2 movie review in Telugu: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' తీశారు. వైఎస్సార్ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అభిమానులనూ మెప్పించారు. 'యాత్ర' చిత్రానికి కొనసాగింపుగా మహి వి రాఘవ్ తీసిన తాజా సినిమా 'యాత్ర 2'. తండ్రి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే ఈ సినిమా. రాజకీయాలు పక్కన పెట్టి సినిమాగా చూస్తే ఎలా ఉంది? వైయస్సార్, జగన్ పాత్రల్లో మమ్ముట్టి, జీవా ఎలా చేశారు? మహి వి రాఘవ్ ఎలా తీశారు? అనేది రివ్యూలో తెలుసుకోండి.


కథ: వైయస్సార్ (మమ్ముట్టి) రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. తన కుమారుడు, ఎంపీగా పోటీ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి (జీవా)ను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పరిచయం చేస్తారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైయస్సార్ మరణించిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు. ప్రోగ్రెస్ పార్టీ హైకమాండ్, మేడమ్ (సుజానే బెర్నెర్ట్) రోశయ్యను సిఎం చేస్తారు. ఆ తర్వాత తండ్రి మరణవార్త విని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కలవడానికి ఓదార్పు యాత్ర చేపడతారు జగన్. అది ఆపేయమని మేడమ్ నుంచి ఆదేశాలు వస్తాయి. వాటిని ధిక్కరించిన జగన్... తాను మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అని, యాత్ర చేస్తానని చెబుతారు. ప్రోగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్థాపిస్తారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు, 2014 & 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? తెలుగునాడు పార్టీ అధినేత చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) నుంచి జగన్ పార్టీకి ఎటువంటి పోటీ ఎదురైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: ప్రేక్షకులకు తెలియని కథ చెప్పడం సులువు. తెలిసిన కథ చెప్పడం కష్టం. ప్రజలందరికీ తెలిసిన కథ, చరిత్రను చెప్పడం... సినిమా తీసి ప్రజలను మెప్పించడం ఇంకా కష్టం. అది దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav)కు తెలుసు. ఆల్రెడీ 'యాత్ర' తీసిన అనుభవం ఆయనకు ఉంది. 'యాత్ర 2'లో ఆ అనుభవం, దర్శకుడిగా నేర్పరితనం మరొకసారి కనిపించింది.


'యాత్ర 2' కథ ప్రజలకు తెలియనిది కాదు. కథగా చూస్తే అందరికీ తెలుసు. అది దృష్టిలో పెట్టుకుని కథనం, సన్నివేశాల్లో మహి వి రాఘవ్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. కథతో కంటే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రయత్నం చేశారు. విశ్రాంతి వరకు మహి వి రాఘవ్ సూపర్ సక్సెస్ అయ్యారు. తర్వాత నుంచి కథనంలో వేగం నెమ్మదించింది. ఫస్టాఫ్‌లో డ్రామా పండింది. సెకండాఫ్‌లో డ్రామా తగ్గింది. మళ్లీ పతాక సన్నివేశాల్లో హై ఇచ్చారు.


జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా 'యాత్ర 2' ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని ప్రోపగాండా సినిమాగా చూసే రాజకీయ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఎలివేట్ చేయడం కోసం ఇతరుల్ని తక్కువ చేసే చీప్ ట్రిక్స్ మహి వి రాఘవ్ ఫాలో కాలేదు. ప్రోపగాండా సినిమాగా కాకుండా, ఓ కథగా చెప్పారు. 'మనం తలపడుతున్నది చంద్రబాబుతో, తక్కువ అంచనా వేయకూడదు' అని జగన్ పాత్రధారితో డైలాగ్ చెప్పించారు. వీలు ఉన్నంత వరకు మిగతా పాత్రలను తక్కువ చూపించారు. షర్మిల, పవన్ పాత్రలు లేవు. తాను చెప్పాలనుకున్న తండ్రి కొడుకుల కథలో ఆ పాత్రలకు అవకాశం లేదని మహి వి రాఘవ్ ముందే చెప్పారు. అయితే... చరిత్ర తెలిసిన వాళ్ల నుంచి అవి మిస్ అయ్యాయనే కంప్లైంట్ రావచ్చు. జగన్ పాత్ర మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయడంతో ఆయన షో రీల్ అని కామెంట్స్ రావచ్చు.


'యాత్ర 2'కు అసలైన బలం సంతోష్ నారాయణన్ సంగీతం, మహి వి రాఘవ్ రచన & దర్శకత్వం, శ్రవణ్ కటికనేని ఎడిటింగ్! ప్రతి మాట, సన్నివేశం తూటా తరహాలో అవసరమైన మేరకు ఉన్నాయి. మహి పలు సన్నివేశాల్లో మాటలతో మేజిక్ చేశారు. 'జగన్ రెడ్డి కడపోడు' వంటి సింపుల్ డైలాగులు వచ్చినప్పుడు విజిల్స్ పడేలా సన్నివేశాలు తీశారు. 'నాయకులకు తెలిసినంత రాజకీయం కార్యకర్తలకు తెలియదు కదా సార్' వంటి డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. అందుకు మరో కారణం సంతోష్ నారాయణన్ సంగీతం కూడా! పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్. ఎడిటింగ్ కూడా బావుంది. మధి సినిమాటోగ్రఫీ బావుంది. సెకండాఫ్ అసెంబ్లీ సన్నివేశాల్లో మరింత ఆసక్తికరంగా ఉంటే బావుండేది. ప్రేక్షకులకు తెలిసిన చరిత్ర కావడంతో అక్కడ తన మార్క్ సీన్లు రాసే అవకాశం మహికి రాలేదు. దాంతో సినిమా నెమ్మదించింది.


Also Readమిస్ పర్ఫెక్ట్ రివ్యూ: క్లీనింగ్ పిచ్చితో లావణ్యకు ఎన్ని తిప్పలో - వెబ్ సిరీస్ హిట్టా? ఫట్టా?


'యాత్ర 2'లో వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి మరోసారి తనదైన నటన, డైలాగ్ డెలివరీతో మెస్మరైజ్ చేశారు. జీవా సర్‌ప్రైజింగ్ ప్యాకేజ్. ఆయనలో నటుడిని ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఎవరూ వాడుకోలేదు. సినిమా ప్రారంభమైన కాసేపటికి జీవాను మర్చిపోతాం. జగన్ అనుకుంటాం. అంతలా వైఎస్ జగన్ యాటిట్యూడ్, మేనరిజమ్స్ పట్టుకున్నారు జీవా. వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్, విజయమ్మగా ఆశ్రిత వేముగంటి, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్ పాత్రల నిడివి తక్కువ. కానీ, ఉన్నంతలో ఆకట్టుకున్నారు. శుభలేఖ సుధాకర్, కిషోర్ కుమార్ పొలిమేర తదితరులు అద్భుతంగా నటించారు. తమిళ నటుడు జార్జ్ మరియమ్ కనిపించేది రెండు మూడు సీన్లు అయినా సరే ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.


తండ్రి మరణం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరేమో!? ఇది వైఎస్ జగన్ జైత్రయాత్ర. సినిమాగా చూస్తే... రాజకీయ నేపథ్యంలో ఇటీవల వచ్చిన సినిమాల్లో డీసెంట్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. జగన్ వ్యతిరేకులకు సినిమా నచ్చే అవకాశాలు తక్కువ.


Also Read: అంబాజీపేట మ్యారేజి బ్యాండు రివ్యూ: తమిళ సినిమాలకు ధీటుగా, సుహాస్ క్యాస్ట్ బేస్డ్ ఫిల్మ్ ఎలా ఉందంటే?