Bootcut Balaraju review Telugu: 'బిగ్ బాస్' సీజన్ 4లో పార్టిసిపేట్ చేయడానికి ముందు టీవీలో సోహైల్ స్టార్. ఆయన మూడు సూపర్ హిట్ సీరియల్స్ చేశారు. సినిమాల్లో హీరో. కొన్ని సినిమాలు చేశారు. 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత 'లక్కీ లక్ష్మణ్', 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు', 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమాలు చేశారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'బూట్‌కట్ బాలరాజు'. ఈ సినిమా ఎలా ఉందో చూడండి.


కథ: బాలరాజు (సయ్యద్ సోహైల్)ది పల్లెటూరు. ఊరిలో అతనికి పెద్దగా విలువ లేదు. స్నేహితులు (అవినాష్, సద్దాం)తో కలిసి కాలేజీకి వెళ్లడం, రావడం, లైఫ్ ఎంజాయ్ చేయడం తప్ప పెద్దగా చేసేది ఏమీ ఉండదు. బాలరాజు, ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్రజ) కుమార్తె మహాలక్ష్మి (మేఘ లేఖ) ప్రేమలో పడతారు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని ఇద్దరూ ప్రేమ కౌగిలిలో మునిగి తేలుతుంటారు. కుమార్తెకు వేరే సంబంధం నిశ్చయం చేసుకుని వచ్చిన పటేలమ్మ కంట పడతారు. 


బాలరాజు తల్లిదండ్రుల్ని పిలిచిన పటేలమ్మ... పంచాయితీలో కొట్టిస్తుంది. ఊరు వదిలి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. దాంతో బాలరాజు, పటేలమ్మ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. 'ఊరి జనాలందరూ ఓట్లు వేస్తే మీరు సర్పంచ్ అవ్వలేదు. మీకు మీరే సర్పంచ్ అనుకుంటున్నారు' అని పటేలమ్మను బాలరాజు ఎదిరిస్తాడు. 'నా మీద పోటీ చేసి గెలిస్తే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా' అని పటేలమ్మ సవాల్ విసురుస్తుంది. అది స్వీకరించిన బాలరాజు సర్పంచ్ ఎన్నికల్లో గెలిచాడా? లేదా? తన ప్రేమ దక్కించుకున్నాడా? లేదా? పటేలమ్మ గతం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ: కోటలో రాణితో కామన్ మ్యాన్ ప్రేమలో పడటం కొత్త కాదు. తెలుగులో ఆ తరహా కథలు చాలా వచ్చాయి. అయితే... 'బూట్‌కట్ బాలరాజు'ను కొత్తగా మార్చి తెరపైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ పల్లె నేపథ్యంతో పాటు హీరో సయ్యద్ సోహైల్ (Bigg Boss Sohel)కు దక్కుతుంది.


'బూట్‌కట్ బాలరాజు'లో హీరోగా నటించడంతో పాటు నిర్మాత ఎండీ పాషాతో కలిసి నిర్మాణ బాధ్యతలను సైతం చూసుకున్నారు సోహైల్. రాజీ పడకుండా కథకు అవసరమైన దాని కంటే ఎక్కువ ఖర్చు చేశారు. ఇంద్రజ, సునీల్ వంటి పేరున్న ఆర్టిస్టులను ప్రధాన పాత్రలకు తీసుకోవడంతో పాటు ముక్కు అవినాష్, సద్దాం, సిరి హనుమంతు వంటి ట్రెండింగ్ సోషల్ మీడియా స్టార్లను సినిమాలో నటింపజేశారు.


దర్శకుడు కోనేటి శ్రీ పల్లెటూరి నేపథ్యంలో కుటుంబ విలువలతో కూడిన మంచి కథ రాసుకున్నారు. రొటీన్ స్టోరీ అనిపించినా... కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులు ఉన్నాయి. కథను ప్రారంభించిన విధానం కూడా బావుంది. అయితే... కథనంలో తడబడ్డారు. కొన్ని సన్నివేశాలు రిపీట్ చేసినట్లు ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత నిడివి ఎక్కువైంది. అల్లరి చిల్లరగా తిరిగే హీరో ఛాలెంజ్ స్వీకరించడంలో హీరోయిజం ఉంది. అయితే... దానిని ఎలివేట్ చేసేలా సెకండాఫ్ రాసుకోలేదు. పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ పరంగా నిడివి విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉంటే బావుండేది. సినిమాటోగ్రఫీ బావుంది.


'బూట్‌కట్ బాలరాజు'కు బలం హీరో సయ్యద్ సోహైల్. సినిమాను తన భుజాలపై మోశారు. రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అవినాష్, అతనికి మధ్య కామెడీ సీన్లు బావున్నాయి. వాళ్లిద్దరి టైమింగ్ నవ్విస్తుంది. ఎన్నికల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను బాగా రాసుకున్నారు. సోహైల్, ఆమెకు తల్లిగా నటించిన మధ్య సన్నివేశాల్లో ఎమోషన్ బావుంది. పిల్లలపై తల్లి ప్రేమ ఎప్పటికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు.


Also Read: మిస్ పర్ఫెక్ట్ రివ్యూ: క్లీనింగ్ పిచ్చితో లావణ్యకు ఎన్ని తిప్పలో - వెబ్ సిరీస్ హిట్టా? ఫట్టా?


తెలుగమ్మాయి, హీరోయిన్ మేఘ లేఖ అందంగా ఉంది. చక్కగా నటించింది. సిరి హనుమంతుది సెకండ్ హీరోయిన్ రోల్ అని చెప్పవచ్చు. ఆమె కూడా బాగా చేశారు. ఇక పటేలమ్మగా కీలక పాత్రలో నటించిన ఇంద్రజ తన నటన ఆకట్టుకుంటారు. ఆమె వల్ల పాత్రకు హుందాతనం వచ్చింది. సునీల్ అనుభవం నటనలో చక్కగా కనిపించింది. సద్దాం, జబర్దస్త్ రోహిణి తదితరులు నవ్వించారు.


'బూట్‌కట్ బాలరాజు' సినిమాలో కథ కంటే కామెడీ ఎక్కువ ఆకట్టుకుంటుంది. హీరో సోహైల్ మరోసారి తన నటన మెప్పించారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే రెండున్నర గంటలు హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఎమోషన్స్ బావున్నాయి. పిల్లలతో పాటు పెద్దలు... ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది.


Also Read: కిస్మత్ రివ్యూ: అదృష్టం అన్నిసార్లూ కలిసి రాదయ్యా - క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?