Kismat Telugu movie review starring Naresh Agastya, Abhinav Gomatam, Vishwadev Rachakonda and Avasarala Srinivas: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ రాచకొండ హీరోలుగా నటించిన సినిమా కిస్మత్. అవసరాల శ్రీనివాస్ కీ రోల్ చేశారు. నరేష్ అగస్త్య జోడీగా రియా సుమన్ నటించారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.


కథ: కార్తీక్ (నరేష్ అగస్త్య), అభి (అభినవ్ గోమఠం), కిరణ్ (విశ్వదేవ్ రాచకొండ)... ముగ్గురూ స్నేహితులు. బీటెక్ చేశారు గానీ ఉద్యోగాలు రాలేదు. మంచిర్యాలలో గొడవ కావడంతో హైదరాబాద్ వస్తారు. ఓ రూంలో దిగుతారు. బ్యాక్ డోర్ జాబ్స్ కోసం పది లక్షలు కొట్టేస్తారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కొన్ని రోజులకు బోర్డు తిప్పేయడంతో ముగ్గురు స్నేహితులు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. వాళ్లకు 20 కోట్లు దొరుకుతాయి. ఆ డబ్బు ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన జనార్ధన్ (అజయ్ ఘోష్)వి. ఆయనకు 30కి పైగా కాలేజీలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే... ఆయన కాలేజీలోనే ఆ ముగ్గురు చదివారు. 


కార్తీక్, కిరణ్, అభి దగ్గర 20 కోట్లు ఉన్నట్లు జనార్ధన్ లేదా ఆ డబ్బు కోసం వెతుకుతున్న అతని అనుచరుడు సూరి (టెంపర్ వంశీ)కి తెలిసిందా? ఆ డబ్బు కోసం ఎస్సై వివేక్ (అవసరాల శ్రీనివాస్) ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు? ఆ డబ్బు ఎన్ని  చేతులు మారింది? చివరికి ఎవరి దగ్గరకు చేరింది? కార్తీక్, తాన్య (రియా సుమన్) మధ్య ప్రేమ కథ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ: కిస్మత్... ఓ క్రైమ్ కామెడీ ఫిల్మ్. ఈ జానర్ సినిమాలకు కావాల్సిన సెటప్ సినిమాలో ఉంది. ఎన్నికలు, బ్లాక్ మనీ, జాబ్ లేని యువకులు, వాళ్ల చేతికి వచ్చిన 20 కోట్ల రూపాయలు, ఆ డబ్బు కోసం పోలీసుల ఇన్వెస్టిగేషన్... పేపర్ మీద స్కిప్ట్ చూస్తే మాంచి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనిపిస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు  మాత్రం నీరసం వస్తుంది. ఆ స్థాయిలో తెరకెక్కించారు.


'కిస్మత్' కథగా బావుంది. కానీ, స్క్రీన్ మీద చూస్తే డిజప్పాయింట్ చేస్తుంది. సినిమా స్టార్టింగ్ పర్వాలేదు. ఏడో తరగతి కూడా పాస్ అవ్వని, 30 కాలేజీలు పెట్టి కోట్లకు కోట్లు సంపాదించిన విలన్ దగ్గర ఒకడు డబ్బు కొట్టేయడం, దాని కోసం అన్వేషణ చేయడంతో 'కిస్మత్' మొదలుపెట్టారు. అయితే, ఆ ఆసక్తిని ఎక్కువ సేపు కంటిన్యూ చేయలేదు. హీరోల క్యారెక్టర్లు పరిచయం చేసిన తీరులో సినిమా జాతకం అర్థం అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఎక్కువ క్యారెక్టర్లను పరిచయం చేసి కంగాళీ చేసి పారేశారు.


ముగ్గురు కుర్రాళ్లు మంచిర్యాల నుంచి హైదరాబాద్ రూంలోకి రాగానే ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించవచ్చు. తర్వాత అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ పరిచయంతో కథలో స్పీడ్ పెరుగుతుందని ఆశిస్తే... అదీ జరగలేదు. టామ్ అండ్ జెర్రీ ఎపిసోడ్స్‌లా కథను అక్కడక్కడ తిప్పారు. టెక్నికల్ అంశాల పరంగా చూసినా సోసోగా ఉంది. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయన స్థాయిలో పాటలు, నేపథ్య సంగీతం లేవు.


Also Read: మిస్ పర్ఫెక్ట్ రివ్యూ: క్లీనింగ్ పిచ్చితో లావణ్యకు ఎన్ని తిప్పలో - వెబ్ సిరీస్ హిట్టా? ఫట్టా?


అభినవ్ గోమఠం మరోసారి వన్ లైనర్స్, పంచ్ డైలాగులతో కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. నరేష్ అగస్త్య, విశ్వదేవ్ రొటీన్ క్యారెక్టర్లు చేశారు. తమ పరిధి మేరకు చేశారు. రియా సుమన్ పాత్ర నిడివి తక్కువ. ఆమెకు పెద్దగా నటించే అవకాశం రాలేదు. కథను కీలక మలుపులు తిప్పే సన్నివేశాల్లో ఉన్నారంతే! అజయ్ ఘోష్ తనదైన విలనిజం చూపించారు. 'టెంపర్' వంశీది రొటీన్ రోల్ అయినా బాగా చేశారు. అవసరాల శ్రీనివాస్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ను సరిగా వాడుకోలేదు.


'కిస్మత్' కథలో విషయం ఉంది. సినిమాలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ, తీయడం కుదరలేదు. ఫుల్లుగా నవ్వించలేదు. థ్రిల్లు ఇవ్వలేదు. డిజప్పాయింట్ చేశారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు తమ 'కిస్మత్' బాలేదనుకుని బయటకు రావడం తప్ప ఏమీ చేయలేరు.


Also Readఅంబాజీపేట మ్యారేజి బ్యాండు రివ్యూ: తమిళ సినిమాలకు ధీటుగా... సుహాస్ క్యాస్ట్ బేస్డ్ ఫిల్మ్ ఎలా ఉందంటే?