Heroine in Baby Hindi Remake: యంగ్ నటీనటులతో, యూత్‌ఫుల్ స్టోరీతో సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ మూవీ ఓ రేంజ్‌లో హిట్‌ను అందుకుంది. తెలుగులో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీని ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ముందుగా ‘బేబీ’ హిందీ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని ఇప్పటికే సాయి రాజేష్.. ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఇప్పుడు ఈ రీమేక్ గురించి బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ‘బేబీ’ హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఫైనల్ అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అతిలోక సుందరి వారసురాలు ఈ రీమేక్‌లో లీడ్ రోల్‌గా ఫైనల్ అయ్యిందట.


‘అర్జున్ రెడ్డి’ తరహాలోనే..


హిందీలో రీమేక్ అవ్వనున్న ‘బేబీ’కి కూడా సాయి రాజేషే దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. హిందీలో కూడా ఈ కథలో పెద్దగా మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో దర్శకుడు లేనట్టు తెలుస్తోంది. తెలుగులో ఉన్న కథనే అచ్చం అలాగే హిందీలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడట. ‘బేబీ’ని తెలుగులో నిర్మించిన ఎస్‌కేఎన్.. హిందీ రీమేక్‌ను కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ మూవీ తెలుగులో బ్లాక్‌బస్టర్ అయ్యింది. అదే విధంగా దాని హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే విధంగా ‘బేబీ’ తెలుగులో ఎలా అయితే విజయాన్ని సాధించిందో.. హిందీలో రీమేక్ కూడా అదే విజయాన్ని అందుకుంటుందని ఎస్‌కేఎన్ ధీమా వ్యక్తం చేశారు.


సెన్సేషన్‌గా మారిన వైష్ణవి చైతన్య..


‘బేబీ’లో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించగా.. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో హీరోలకంటే హీరోయిన్‌గా నటించిన వైష్ణవి చైతన్యకే ఎక్కువ మార్కులు పడ్డాయి. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన వైష్ణవి.. ‘బేబీ’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇక హిందీలో ఈ పాత్రను చేయడానికి స్టార్ కిడ్‌ను సెలక్ట్ చేశారట మేకర్స్. తను మరెవరో కాదు.. శ్రీదేవి వారసురాలు ఖుషి కపూర్. ఎస్‌కేఎన్‌తో పాటు బోనీ కపూర్ గానీ, కరణ్ జోహార్ గానీ.. ఈ రీమేక్‌ను నిర్మించడంలో భాగం అవ్వనున్నారట. అందుకే ఈ స్టార్.. ‘బేబీ’ హిందీ రీమేక్‌లో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.


‘ది ఆర్చీస్’తో ఎంట్రీ..


ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్.. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టి అమితమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పుడు అదే బాటలో ఖుషి కపూర్ కూడా వెళ్తోంది. ఇప్పటికే ‘ది ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్‌తో ప్రేక్షకులను పలకరించింది ఖుషి. దీని ద్వారా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ కూడా ఆడియన్స్‌కు పరిచయమయ్యింది. కానీ ఈ ఇద్దరి యాక్టింగ్‌పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయినా కూడా స్టార్ కిడ్ కాబట్టి ఇప్పటికే ఖుషి ఖాతాలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ‘బేబి’ రీమేక్‌లో కూడా ఖుషి కూడా హీరోయిన్ అని చెప్పడంతో తన నటన ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.


Also Read: మనిషి స్పర్శ తాకితే ఏమవుతుంది? ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన ‘గామి’ డైరెక్ట‌ర్