థియేటర్స్ బంద్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తాము ఎవరి సినిమాకు వ్యతిరేకం కాదని ఎవరి సినిమాను అడ్డుకోవడం లేదని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. అయితే తెర వెనుక జరిగిన వ్యవహారాలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసు నోచుకునేలా చేసినట్లు ఉన్నాయి. ఫిలిం ఛాంబర్ ఇచ్చిన వివరణ పట్ల ఆయన సంతృప్తి చెందినట్లు లేరు. ఏకంగా ఆయన రంగంలోకి దిగారు. ఘాటుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ విడుదల అయ్యింది.
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' జూన్ 13వ తేదీన థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్న తరుణంలో... జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారని వచ్చిన వార్తల మీద విచారణ చేయాలని హోమ్ శాఖ కార్యదర్శిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఆ తర్వాత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సమావేశం అయ్యి బంద్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. కానీ, తెర వెనుక జరిగిన వ్యవహారాల పట్ల పవన్ కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాని ఫలితమే ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన లేఖ.
పవన్ పిలిచినా రాలేదు...
ప్రభుత్వం పట్ల కృతజ్ఞత ఏది?
ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, చిత్రసీమ ప్రముఖుల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా కూటమి ప్రభుత్వం చూస్తుంటే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత టాలీవుడ్ పెద్దల నుంచి కనిపించడం లేదని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా తెలుగు సినిమా సంఘాలు కలవలేదని స్పష్టం చేసింది.
తమ సినిమాలు విడుదల అయ్యే సమయంలో టికెట్ రేట్స్ పెంపు కోసం ఆయా నిర్మాతలు వచ్చినప్పుడు... అందరూ కలసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన సూచన పట్ల సానుకూలంగా స్పందించలేదని స్పష్టం చేసింది డిప్యూటీ సీఎం కార్యాలయం.
జగన్ ప్రభుత్వంలో ఛీత్కారాలు మరిచారా?
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు టికెట్ రేట్స్ పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం హీరోలతో పాటు దర్శక నిర్మాతలు వెళ్లారు. చిరంజీవి చేతులు జోడించి అడిగిన విజువల్స్ వైరల్ అయ్యాయి. వాటిని ప్రస్తావించింది ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం.
''గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాల్జేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లు ఉన్నాయి. టాలీవుడ్ పెద్దల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయి. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చని వ్యక్తుల సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను (వకీల్ సాబ్ విడుదలప్పుడు జరిగింది) థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు చెప్పినట్టు వ్యక్తులను చూసి కూటమి ప్రభుత్వం పని చేయలేదు. నాగార్జున ఫ్యామిలీ మూవీ (తండేల్) వచ్చినప్పుడు టికెట్ రేట్స్ పెంచింది'' అని పేర్కొంది.
రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాం...
సినిమా రంగానికి ప్రత్యేక పాలసీ!
టాలీవుడ్ నిర్మాతలు అడిగినట్టు టికెట్ రేట్స్ పెంచుతూ... అడిగినన్ని షోలకు అనుమతులు ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా ముందుకు వెళుతుంటే... ఆయన సినిమా విడుదల సమయంలో అడ్డంకులు సృష్టించడం పట్ల ఘాటుగా స్పందించారు. టాలీవుడ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరించినట్టు తెలిపారు. అలాగే, థాంక్స్ చెప్పారు.
ఇప్పటినుంచి వ్యక్తిగత హోదాలో వచ్చే టాలీవుడ్ నిర్మాతలను కలిసేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎటువంటి చర్చలకు తావు లేదని స్పష్టం చేశారు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని వివరించారు. సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పాలసీ తీసుకు రావాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. థియేటర్ల ఆదాయం, వాటి వసతుల మీద నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.
Also Read: టాలీవుడ్ 'కింగ్ పిన్'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?
''ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు పెడుతున్న టికెట్ రేటు, అందుకు పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలను సంబంధిత అధికారులతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చించారు'' అని ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. థియేటర్లు లీజుకు తీసుకున్న వ్యక్తుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా? లేదా? టికెట్ రేట్స్ పెంచినప్పుడు అందుకు తగ్గట్టుగా పన్ను కట్టారా? లేదా? అనేది చూడమని ఆదేశించారు. పార్కింగ్ ఫీజ్ నుంచి పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ వరకు ఎక్కువ రేటుకు అమ్మడం పట్ల అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు.
సినిమా హాళ్ల వరకూ ఉండే విభాగాలలో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పవన్ కల్యాణ్ ఆలోచన చేశారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. దాంతో గుత్తాధిపత్యానికి చెక్ పెడుతున్నట్టు అయ్యింది.
Also Read: మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు? తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?