Paruchuri Gopala Krishna about Guppedantha Manasu Serial: టాలీవుడ్ సీనియర్ రైటర్ అయిన పరుచూరి గోపాల కృష్ణకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందుకే ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో తనకు నచ్చే విషయాలను, నచ్చని విషయాలను.. అన్నీ ఆ యూట్యూబ్ ఛానెల్ ద్వారానే చెప్పుకుంటూ ఉంటారు పరుచూరి. అలా ఆయన పలు సినిమాలపై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీలను క్రియేట్ చేశాయి కూడా. ఇక తాజాగా టీవీ సీరియల్స్‌పై వ్యాఖ్యలు చేస్తూ పరుచూరి ఒక వీడియోను విడుదల చేశారు. అందులో టైటిల్ చెప్పకుండా ఒక సీరియల్ గురించి కామెంట్స్ చేశారు. అయితే ఆయన చెప్పింది ‘గుప్పెడంత మనసు’ గురించే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.
చాలా గ్రేట్..
ముందుగా సీరియల్ రైటర్స్ చాలా గ్రేట్ అని చెప్తూ తన వీడియోను ప్రారంభించారు పరుచూరి గోపాల కృష్ణ. ‘‘ఒక చిన్న అంశాన్ని కథగా రాయడం చాలా గొప్ప. దానిని కథనం చేయడం ఇంకా గొప్ప. ఎన్నో సంవత్సరాల పాటు ఆ అంశాన్ని ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా, టీవీలకు అతుక్కునేలా చేయడం, పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ సీరియల్ చూసేలా చేయడం జోక్ కాదు. మా రచయిత సంఘంలో టీవీ రైటర్స్ కూడా ఉన్నారు. వాళ్లను చూసి ఎంత కష్టపడుతున్నారు అని నవ్వుకుంటాను. ఒక సినిమాను 2 గంటలు డెవలప్ చేయడానికి ఎంత నరకం అనుభవిస్తున్నాం. అలాంటి మీరు ఎన్ని అరగంటలు? సంవత్సరంలో దాదాపు 270 ఎపిసోడ్స్, 2,3 ఏళ్లల్లో ఎన్నో వేల ఎపిసోడ్స్’’ అని చెప్పుకొచ్చారు.
అలా కనెక్ట్ చేశారు..
ఇక ఒక సీరియల్ పేరు చెప్పకుండా దానిపై కూడా కామెంట్స్ చేశారు పరుచూరి. ‘‘ఈమధ్య ఒక సీరియల్‌లో ప్రధానమైన ఒక స్త్రీ పాత్రను చంపేశారు. ఇదేంటి అనుకునేలోపు ఇంకొక స్త్రీ పాత్రను క్రియేట్ చేశారు. చనిపోయిన మహిళ భర్తకు ఆమె ఒకప్పుడు ప్రియురాలుగా బాగా తెలివిగా కనెక్ట్ చేశారు. అందులో హీరో డేట్లు దొరకలేదో, డేట్లు లేకో ఏంటో తెలియదు కానీ అతడి ప్లేస్‌లోకి ఇంకొక అబ్బాయిని దింపారు. ఇదంతా నా భార్యకు వివరించాలని అనుకున్నప్పుడు నన్ను చూడనిస్తారా అని నా మాట వినలేదు. అంటే మహిళలు టీవీ సీరియల్స్‌ను ఎంత కాపాడుతున్నారో చెప్పడానికి ఒక ఉదాహరణ మా ఆవిడే’’ అని అన్నారు పరుచూరి గోపాల కృష్ణ.
‘గుప్పెడంత మనసు’ గురించే..
సీరియల్ పేరు చెప్పకుండా పరుచూరి వ్యాఖ్యలు చేసినా కూడా బుల్లితెరను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి ఆయన ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌పైనే ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతుంది. ఆ సీరియల్‌లో లీడ్ రోల్స్‌గా రిషీ, వసులు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. కానీ కొన్నిరోజులుగా రిషీ పాత్రలో కనిపించాల్సిన ముకేశ్ గౌడ కనిపించడం లేదు. ఆ స్థానంలోకి వేరే వ్యక్తి వచ్చాడు. కానీ ప్రేక్షకులు మాత్రం ముకేశ్‌ను మిస్ అవుతున్నారు. అలా సీరియల్ హీరోలు డేట్స్ దొరికకపోయినా.. ఇంకా ఏ ఇతర సమస్య వచ్చినా మేకర్స్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో పరుచూరి తనదైన శైలిలో వివరించారు. ఈసారి సీరియల్ రైటర్స్‌ను కలిసినప్పుడు కచ్చితంగా అభినందిస్తానని తెలిపారు.
Also Read: ఒక కల నెరవేరిందంటున్న ఉపాసన - తాత ప్రతాప్ సింగ్, కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యలో ప్రత్యేక పూజలు