సౌత్ ఇండియన్ హీరోల క్రేజ్ దేశం మొత్తం విస్తరిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఢిల్లీలో జరిగిన ‘రావణ దహన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ లవ్ కుశ్ రామ్‌లీల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశారు. ఆయన్ని చూసేందుకు, ఫొటోలు తీసేందుకు నార్త్ ఇండియా ప్రజలు కూడా ఎగబడటం ఆయన క్రేజ్‌ను తెలుపుతుంది.
ప్రభాస్‌కు ఉన్న భారత సంస్కృతిపై అంకిత భావం కారణంగా ఆయన్ని రావణ దహన కార్యక్రమానికి పిలిచామని లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్ అర్జున్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. దీని కారణంగా లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ నిర్వహకులు ఈ సారి ఉత్సవాలను మరిం ఘనంగా నిర్వహించారు. ప్రభాస్ అతిథిగా పాల్గొనడంతో ఆ కార్యక్రమం మరింత పెద్దదిగా మారింది.
కేవలం దక్షిణ భారత సినీ పరిశ్రమ మాత్రమే కాకుండా పాటు దేశం మొత్తం ప్రభాస్ పేరు ప్రఖ్యాతులు విస్తరించాయి. భారత దేశ చరిత్రలో వేళ్లానుకున్న కథలను ఆయన సినిమాలుగా ఎంచుకుంటున్నారు. బాహుబలి లాంటి జానపద కథలో నటించి పాన్ ఇండియా స్టార్‌డం సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ లాంటి పౌరాణిక చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు కాబట్టే రావణ దహనం ఈ ఏడాది ఆయనతో చేయిస్తున్నాం అని లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్ అర్జున్ కుమార్ ప్రకటించారు.
ఇక రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ చిత్ర బృందం కూడా సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం విశేషం. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వాళ్లిచ్చిన కానుకలను కూడా స్వీకరించి ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. అనంతరం విల్లు ఎక్కుపెట్టి రావణ దిష్టిబొమ్మకు సంధించాడు. కార్యక్రమం ఆఖర్లో రామావతారంలో ఉన్న నటులకు ఆదిపురుష్ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి హారతి పట్టాడు ప్రభాస్. అంతకు ముందు ఆదిపురుష్ టీజర్‌ను సైతం ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.