Oscars 2025 Event Live Streaming Date And Time Details: సినీ రంగంలో నోబెల్ బహుమతిగా భావించే ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 (Oscar 2025) అవార్డుల పండుగ మొదలైంది. ఈ ఏడాది 97వ ఆస్కార్స్ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) డాల్బీ థియేటర్‌లో జరగనున్నాయి. ఇప్పటికే పలు విభాగాల్లో పోటీ పడుతున్న చిత్రాల లిస్ట్‌ను ప్రకటించారు. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 3న (సోమవారం) ఉదయం 5:30 గంటలకు ఆస్కార్స్ వేడుక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా ప్రముఖ అమెరికన్ టీవీ హోస్ట్, యాక్టర్, కమెడియన్, రైటర్, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ (Conan O Brien) హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఈవెంట్ లైవ్‌ను భారత సినీ అభిమానులు ABC, Hulu ఫ్లాట్ ఫాంలో చూడొచ్చు. అలాగే, స్టార్ మూవీస్, జియో హాట్ స్టార్‌లో సోమవారం ఉదయం 5:30 గంటల నుంచి చూడొచ్చు.
భారతీయ చిత్రాలకు నిరాశ
ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో భారతీయ చిత్రాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. గతేడాది ఆస్కార్ అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మూవీలో 'నాటు నాటు' పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన 'అనూజ' షార్ట్ ఫిల్మ్ ఈ ఏడాది నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మూవీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది.
Also Read: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ ఏడాది 'ఆస్కార్' ఎవరిని వరిస్తుందో..?
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెస్ట్ మూవీ కేటగిరీలో.. ది బ్రూటలిస్ట్, అనోరా, ఎ కంప్లీట్ అన్‌నోన్, ఎమిలియా పెరెజ్, డ్యూన్: పార్ట్ 2, ఐయామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, వికెడ్ చిత్రాలు బరిలో నిలిచాయి. అలాగే, బెస్ట్ డైరెక్టర్ విభాగంలో.. సీన్ బేకర్ (అనోరా మూవీ), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మ్యాన్ గోల్డ్ (ఎ కంప్లీట్ అన్ నోన్), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్) నామినేట్ అయ్యారు.
అటు, బెస్ట్ యాక్టర్ బరిలో.. అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్ మూవీ), తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్‌నోన్), కోల్‌మెన్ డొమినింగో (సింగ్ సింగ్), రే ఫియన్నెస్ (కాన్‌క్లేవ్), సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్) నామినేట్ కాగా.. ఇక బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో.. సింథియా ఎరివో (విక్‌డ్ మూవీ), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్ (అనోరా), డెమిమూర్ (ది సబ్ స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐయామ్ స్టిల్ హియర్) బరిలో నిలిచారు. మరి వీరిలో ఎవరినో ఆస్కార్ వరిస్తుందో చూడాలి. హాలీవుడ్ మూవీ 'ఎమిలియా పెరెజ్' అత్యధికంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకోగా.. విక్‌డ్ మూవీ 10 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది.
Also Read: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి - ఆ ప్రచారంలో నిజమెంత?, అలాంటి వారికి వార్నింగ్