Naga Chaitanya's Thandel OTT Release On Netflix Officially Announced: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన 'తండేల్' (Thandel) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మత్స్యకారుల జీవితాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా, ఈ మూవీ ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్' వేదికగా 'తండేల్' స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీ అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Also Read: హారర్ థ్రిల్లర్ క్రైమ్ మూవీస్‌తో పాటు సిరీస్‌లు - 'జియో హాట్ స్టార్'లో మార్చిలో రాబోయే చిత్రాలివే!

'తండేల్' కథేంటంటే..?

శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులకు సంబంధించి యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందరినీ నడిపించే నాయకుడి పేరే తండేల్. తన తండ్రి దగ్గరి నుంచే ఈ లక్షణాలను నేర్చుకుంటాడు రాజు (నాగచైతన్య). అతనికి చిన్న నాటి స్నేహితురాలు సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. ఆమెకు కూడా అతనంటే ఇష్టం. 9 నెలలు సముద్రంలో.. మరో 3 నెలలు ఊరిలో గడుపుతూ ఉంటారు మత్స్యకారులు. ఈసారి వేటకు వెళ్లి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు రాజు, సత్య. ఆ సమయంలో తుపాను అల్లకల్లోలం సృష్టించగా.. పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశిస్తారు. ఆ సమయంలో అక్కడి కోస్ట్ గార్డ్ అధికారులు వీరిని జైల్లో వేస్తారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సత్య ఏం చేసింది.? వారి కుటుంబాలు పడ్డ బాధ, అసలు సత్య రాజుని విడిపించిందా..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

నాగచైతన్య, సాయిపల్లవి నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం, పాటలు మూవీకే హైలెట్‌గా నిలిచాయి. శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ ఘటనలకు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ జోడించి దర్శకుడు చందూ మొండేటి సినిమాను సూపర్‌గా రూపొందించారు. నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.

Also Read: సత్యభామతో సవాల్ చేస్తే చావే - 'శివంగి'గా ఆనంది పవర్ ఫుల్ యాక్షన్ అదుర్స్, థ్రిల్లింగ్ ట్రైలర్ చూశారా?