యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో బుధవారం రాత్రి పార్టీ జరిగింది. అమెజాన్ స్టూడియోస్ (ఇంటర్నేషనల్) వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ (James Farrell) సహా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... 


ఎన్టీఆర్ కోసం వచ్చిన జేమ్స్!
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు ముందు నుంచి ఎన్టీఆర్ నటనకు విదేశాల్లో అభిమానులు ఉన్నారు. అయితే, 'ఆర్ఆర్ఆర్' తర్వాత మరింత ఎక్కువ మందికి ఆయన గురించి తెలిసింది. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అభినయానికి అభిమానులు అయ్యారు. అమెజాన్ స్టూడియోస్, ఇంటెర్నేషన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ కూడా మర్యాదపూర్వకంగా ఎన్టీఆర్ ఇంటికి వచ్చారని తెలిసింది. ఆయన్ను కలవడం కోసమే అమెరికా నుంచి వచ్చారట. రావడంతో చిత్రసీమలో కొంత మందిని పిలిచి స్పెషల్ పార్టీ ఇచ్చారు ఎన్టీఆర్!


పార్టీకి ఎవరెవరు వచ్చారు?
జేమ్స్ వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీకి దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ హాజరు అయ్యారు. నిర్మాతల్లో 'బాహుబలి' శోభు యార్లగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, 'దిల్' రాజు సోదరుడు శిరీష్ ఉన్నారు. 


వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కుమార్తె, స్వప్న సినిమాస్ నిర్మాత స్వప్న దత్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ సైతం పార్టీలో కాసేపు సందడి చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. అయితే, వాళ్ళు త్వరగా పార్టీ నుంచి వెళ్లిపోయారట. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఢిల్లీలో ఉండటంతో పార్టీకి రాలేకపోయారట. సుకుమార్ సైతం 'పుష్ప 2' షూటింగ్ కోసం విశాఖ వెళ్లారట. ఆయనకూ ఆహ్వానం ఉన్నా అటెండ్ కాలేదు. 


ఎన్టీఆర్... అమెజాన్... 
హాలీవుడ్ సినిమా తీస్తే?
'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పుడు ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకుంటుందా? అని చర్చ మొదలైంది. అంతే కాదు... 'ఆర్ఆర్ఆర్' తర్వాత హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని ఎన్టీఆర్ తెలిపారు. ఆయనకు అక్కడ నుంచి పిలుపు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు జేమ్స్ ఇండియాకు రావడం, అదీ నందమూరి కథానాయకుడిని ప్రత్యేకంగా కలవడం కోసమే రావడంతో అమెజాన్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ ఏమైనా ఎన్టీఆర్ హీరోగా స్పెషల్ సినిమా ప్లాన్ చేస్తుందా? అని చర్చ మొదలు అవుతోంది. ఎన్టీఆర్ సినిమాలకు, ఈ పార్టీకి సంబంధం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.    


త్వరలో ఎన్టీఆర్ 30 గోవా షెడ్యూల్
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాదులో ముగిసింది. ఆల్రెడీ ఆ షూట్ స్టిల్స్ లీక్ అయ్యాయి. త్వరలో గోవా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. బహుశా... ఈ నెల 19న ఎన్టీఆర్ & కో గోవా వెళ్ళవచ్చు. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. 


Also Read : బాలీవుడ్‌లో ఎన్టీఆర్ భారీ సినిమా - హృతిక్ రోషన్ 'వార్ 2'లో!