యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో 'బ్రహ్మాస్త్ర' సినిమా మీడియా సమావేశం జరిగింది. నిజానికి, ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ (Brahmastra Pre Release Event) నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే... పోలీసుల నుంచి అనుమతులు రాకపోవడంతో అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అందుకు అభిమానులకు ఎన్టీఆర్ సారీ చెప్పారు.
 
అభిమాన సోదరులకు క్షమాపణలు : ఎన్టీఆర్ 
''ఎంతో ఆర్భాటంగా ఈవెంట్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే... వినాయక చవితి ఉండటం వల్ల పోలీస్ బందోబస్తు ఎక్కువ అందచేయలేమని పోలీస్ శాఖ వారు తెలిపారు. వాళ్ళు పని చేసేది మన భద్రత కోసం! వాళ్ళు చెప్పిన మాట వినడం దేశ పౌరుడిగా మన ప్రథమ ధర్మం కాబట్టి... చిన్న వేదికలో ఈ విధంగా ఫ్యాన్స్ ముందుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన, వద్దామని అనుకున్న వారందరికీ తలవంచి మన్నింపు కోరుకుంటున్నా'' అని ఎన్టీఆర్ అన్నారు. అభిమానులు 'బ్రహ్మాస్త్ర' వేడుకకు రాలేనప్పటికీ... వాళ్ళు ఎప్పుడూ మంచి చిత్రాన్ని ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ముందుకు వెళదామని ఆయన అన్నారు.


సవాల్‌ను స్వీకరిద్దాం : ఎన్టీఆర్
ఇప్పుడు అంతర్జాతీయంగా సినిమా ఇండస్ట్రీ ఒత్తిడిలో ఉందని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ప్రేక్షకులకు ఇప్పుడు ఇస్తున్న కంటెంట్ కంటే కొత్తది ఇంకేదో కావాలని ఆయన అన్నారు. ఒత్తిడిలో మనమంతా బాగా పని చేస్తామని, ఒత్తిడి మంచిదేనని, చిత్రసీమ ఈ సవాల్ స్వీకరించి ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. సినిమాలను సెలబ్రేట్ చేసుకుందామని ఆయన పిలుపు ఇచ్చారు.


అమితాబ్ ఇంటెన్సిటీకి ఫ్యాన్, ఆ తర్వాత ర‌ణ్‌బీర్‌ : ఎన్టీఆర్
నటనలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటెన్సిటీకి తాను అభిమాని అని ఎన్టీఆర్ తెలిపారు. బిగ్ బి గళం, నిలబడే విధానం... ఆయనలో ప్రతిదీ ఇంటెన్స్‌గా  ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. నటుడిగా తనపై ఎంతో ప్రభావం చూపించారని చెప్పారు (NTR About Amitabh Bachchan). అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ విధంగా ప్రభావం చూపించిన నటుడు, తాను కనెక్ట్ అయ్యింది ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor)కి అని ఎన్టీఆర్ తెలిపారు. ర‌ణ్‌బీర్‌ ప్రతి సినిమా నటుడిగా తనలో స్ఫూర్తి నింపిందని అన్నారు. తనకు నచ్చిన సినిమా 'రాక్ స్టార్' అన్నారు. 'బ్రహ్మాస్త్ర' ప్రచార కార్యక్రమాల్లో తాను కూడా ఒక భాగం కావడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్ తెలిపారు. అలియా భట్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అన్నారు. రాజమౌళి, నాగార్జున బాబాయ్ తర్వాత తన భావోద్వేగాలను ఆలియాతో షేర్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు (NTR Is Fan Of Ranbir Rockstar).


Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్


'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భట్ జంటగా నటించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల చేస్తున్నారు. 


Also Read : ఒకవేళ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తే మహేశ్, రవితేజ, సూర్యకు స్టార్‌డ‌మ్‌ వచ్చేదా?