మలయాళ ఇండస్ట్రీలో హీరో ఫహాద్ ఫజిల్ కి ఎలాంటి స్టార్డం ఉందో అందరికీ తెలిసిందే. కెరియర్ ప్రారంభంలో ఎన్నో వినూత్న సినిమాలు చేసి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఈ మలయాళ హీరో. ఇక ఓటిటి వేదికగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ టైంలో ఫహద్ ఫాజిల్ నటించిన సినిమాలు ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక అదే క్రేజ్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. పుష్ప మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగా భయపెట్టాడో తెలిసిందే. పుష్ప పార్ట్ వన్ చివరి 15 నిమిషాలు బన్వర్ సింగ్ షికావత్ గా భయపెట్టిన ఫహాద్ ఫజిల్ పాత్ర 'పుష్ప 2' లో ఇంకెలా ఉంటుందోనని ఆడియన్స్ లో సర్వత్ర ఆసక్తి నెలకొంది.


ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫహాద్ ఫజిల్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో 'ధూమం' అనే సినిమా కూడా ఒకటి. 'కేజిఎఫ్',  'కాంతారా' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిం సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యూ టర్న్' అనే సినిమాని తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ఫహద్ ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. వినీత్, రోషన్ మాథ్యూ, అచ్యుత్ కుమార్ ఇతర కీలకపాత్రను పోషించారు. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు. జూన్ 23న ధూమం సినిమాని మలయాళం తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ 23న 'ధూమం' సినిమాకు సంబంధించి కేవలం మలయాళం, కన్నడ వెర్షన్ మాత్రమే విడుదల చేస్తున్నారట. ఒకవేళ మలయాళంలో కనుక సినిమా సక్సెస్ అయితే ఆ తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ వెర్షన్ ని విడుదల చేసిన కొన్ని వారాలకు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.


ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు పలు ఇతర ప్రధాన నగరాల్లో ధూమం సినిమా మలయాళ వెర్షన్ బుకింగ్స్ మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. ఇక త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో సాగే సస్పన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ విషయాన్ని మూవీ టీం ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో స్పష్టం చేశారు. డబ్బు, కిడ్నాప్, పోలీసులు, చేజింగ్ సీన్స్.. వీటన్నింటినీ బట్టి చూస్తే ఈ సినిమా ఆడియన్స్ కి మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


Also Read: మంగళవారం రోజు పాప పుట్టడం సంతోషం - జాతకం కూడా చాలా బాగుందంటున్నారు: చిరంజీవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial