Kangana Rnaut - Javed Akhter: నిత్యం సంచలన కామెంట్స్‌, కాంట్రవర్సీ కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తారు బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. తనకు తెలిసింది, తను ఏది అనుకుంటుందో అది మాట్లాడతారు. అలా ఎంతోమంది మీద కామెంట్స్‌ చేసి చిక్కుల్లో ఇరుకున్నారు. అలా ఆరోపణలు చేసి పరువునష్టం కేసు ఎదుర్కొంటున్న ఆమెకు కోర్టులో చుక్కెదురైంది. ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. 


 ఇప్పుడేం చేయలేమన్న కోర్టు


కంగనా రనౌత్‌ మీద పాటల రచయిచ జావెద్‌ అక్తర్‌ పరువునష్టం దావా వేశారు. అయితే.. జావెద్‌ అక్తర్‌ పైన తాను వేసిన కేసును కూడా కలిపి రెండింటిని విచారించాలని కోర్టులో పిటిషన్‌ వేశారు కంగనా రనౌత్‌. ఆ కేసు విచారణకు రాగా.. కంగనా వేసిన పిటిషన్‌ విచారించలేమని కోర్టు చెప్పింది. ఆమె వేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సింగిల్‌ బెంచ్‌ జస్టిస్‌ పి.డి. నాయక్‌ అన్నారు. జావెద్‌ అక్తర్‌ వేసిన కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ మొదలైందని, ఇద్దరిది కలిపి విచారించలేమని తేల్చి చెప్పారు. "జావెద్‌ అక్తర్‌ వేసిన పిటిషన్‌పై ఇప్పటికే విచారణ మొదలైపోయింది. మీరు చాలా లేటుగా పిటిషన్‌ వేశారు. అక్తర్‌ వేసిన కేసులో ఇప్పటికే నోటీసులు కూడా ఇష్యూ చేశాం. కాబట్టి మీకు రిలీఫ్‌ ఇవ్వలేం" అని జడ్జ్‌ అన్నారు. 


అసలు కేసు ఏంటంటే? 


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ కేసుకు సంబంధించి కంగనారనౌత్‌ ఎంతోమంది మీద ఆరోపణలు చేశారు. దాంట్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె జావెద్‌ అక్తర్‌పై కామెంట్స్‌ చేశారు. దీంతో అవి ఫాల్స్‌ ఎలిగేషన్స్‌ అని తన పరువుకు నష్టం వాటిల్లేలా కామెంట్స్‌ చేసిందంటూ కంగనా రనౌత్‌పై 2020లో కోర్టులో దావా వేశారు. దీంతో కంగనా రనౌత్‌కి అంధేరి మెజిస్ట్రేట్, బెయిలబుల్ వారెంట్​ జారీ చేసింది. ఇంతకముందు కూడా కంగనకు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె న్యాయస్థానం ముందు హాజరు కాలేదు. ఆ తర్వాత కంగనా 2021లో అక్తర్‌కి వ్యతిరేకంగా కౌంటర్‌ దాఖలు చేశారు. నేరపూరిత కుట్ర, ప్రైవసీకి భంగం కలిగించాడంటూ ఆయన మీద కేసు పెట్టింది. 2016లో ఒక మీటింగ్‌లో ఆయన తనను బెదరించాడని, తన కో - స్టార్‌కి సారీ చెప్పించేందుకు ప్రయత్నించాడని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక జావేద్ అక్తర్, తన కంప్లైంట్‌ రెండూ ఒకే విషయానికి సంబంధించినవని కంగనా న్యాయస్థానానికి వెల్లడించారు. ఒకే కేసులో రెండు విరుద్ధ తీర్పులను ఇవ్వకుండా కలిపి విచారణ జరపాలని ఆమె అభిప్రాయపడింది. ఈ మేరకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన పిటిషన్ మీద విచారణ నిలిచిపోయిందని చెప్పిన ఆమె, అక్తర్ వేసిన పిటిషన్ మీది విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఇలా విచారణ జరపడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని వెల్లడించింది. అటు కంగన ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు విచారించి ఈ మేరకు తీర్పు చెప్పింది. 


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, ఆ తర్వాత ఆ కేసు అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ కోణం, అలానే నెపోటిజం కారణంగానే సుశాంత్‌సింగ్‌ మరణించాడనే ఆరోపణలు వచ్చాయి. సుశాంత్‌ మరణంపై కంగనారనౌత్‌ అనేక కామెంట్స్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుశాంత్‌ ప్రియురాలిని కూడా అదుపులోకి తీసుకుని  ఆమె ప్రమేయంపై విచారిస్తున్న సంగతి తెలిసిందే.


Also read: ‘సప్త సాగరాలు దాటి' డైరెక్టర్‌‌తో శివరాజ్ కుమార్ మూవీ