బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్,  నిర్మాత, నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు.  57 సంవత్సరాల వయస్సున్న ఆయన మహారాష్ట్ర కర్జాత్‌లోని తన స్టూడియోలో శవమై కనిపించారు. ప్రాథమికంగా పోలీసులు ఆత్మహత్యాయత్నగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఆయన మరణంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. “ఈరోజు ఉదయం, నితిన్ దేశాయ్ ఎన్‌డి స్టూడియోస్‌లో ఉరి వేసుకుని కనిపించారు. ఆత్మహత్యగా భావిస్తున్నా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం” అని రాయగడ ఎస్పీ సోమనాథ్ ఘర్గే వెల్లడించారు.  


నితిన్ దేశాయ్ ఆత్మహత్య కారణం ఇదేనా?


PTI నివేదిక ప్రకారం, దేశాయ్  ఓ సంస్థ నుంచి తీసుకున్న రూ. 252 కోట్ల రుణాన్ని చెల్లించలేకపోయారు. ఆయనకు సంబంధించిన ND's Art World Pvt Ltd, 2016తో పాటు 2018లో ECL ఫైనాన్స్ నుంచి రూ. 185 కోట్లను అప్పుగా తీసుకుంది.  డబ్బులు తిరిగి చెల్లించడంలో ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. NCLT ఆమోదించిన ఆర్డర్‌లో, మొత్తం డిఫాల్ట్ రూ. 252.48 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఆర్డర్ ఆమోదించడానికి ముందు  దేశాయ్ వివరణ ఇచ్చారు. తన స్టూడియోలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. అయినా సదరు కంపెనీ ఆయన స్టూడియోను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.


నితిన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి


దేశాయ్‌  సన్నిహిత మిత్రుడు, బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే నితిన్ మృతి వార్త విని షాక్ అయ్యారు. “నేను తరచుగా అతడితో మాట్లాడేవాడిని.  అమితాబ్ బచ్చన్ అపారమైన నష్టాలను చవిచూసినా, తిరిగి నిలబడ్డారని చెప్పాను. రుణాల కారణంగా స్టూడియోని అటాచ్ చేసినప్పటికీ, మళ్లీ మంచి స్థాయికి వస్తామని చెప్పాను.  అతడి మరణ వార్త వినడం చాలా బాధాకరంగా ఉందన్నారు.


నితిన్ ఎందుకు ఇలా చేశావ్?- వివేక్ అగ్నిహోత్రి


నితిన్ మృతి పట్ల వివేక్ అగ్నిహోత్రి  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. “ప్రియమైన మిత్రుడు నితిన్ దేశాయ్ మరణం గురించి తెలుసుని ఎంతో బాధపడుతున్నాను. ఒక లెజెండరీ ప్రొడక్షన్ డిజైనర్, ఎన్‌డి స్టూడియోను రూపొందించిన దూరదృష్టి గల వ్యక్తి ఆయన. మేము కలిసి పనిచేయని చిత్రాలలో కూడా అతను ఎల్లప్పుడూ నాకు మార్గదర్శనం చేశారు. ఎందుకు నితిన్ ఇలా చేశావ్?” అంటూ ట్వీట్ చేశారు.  బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, నటుడు రితీష్ దేశ్‌ముఖ్ సహా పలువురు టీవీ ప్రముఖులు నితిన్ మృతి పట్ల సంతాపం తెలిపారు.














ఆర్ట్ డైరెక్టర్ గా చక్కటి గుర్తింపు తెచ్చుకున్న నితిన్


గత కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా నితిన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ‘సలాం బాంబే’, ‘1942 ఏ లవ్ స్టోరీ’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘లగాన్’, ‘దేవదాస్’, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’,  ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘జోధా అక్బర్’ సహా పలు సినిమాలతో అద్భుతమైన ఆర్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ముంబై శివారులో ఎన్‌డీ స్టూడియోస్‌ ని స్థాపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అదే స్టూడియోలో ఆత్మహత్య చేసుకున్నారు.






Read Also: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఆదిపురుష్’, ‘భాగ్ సాలే’ మూవీస్, ‘హిడింబ’- స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial