ఇష్క్... నితిన్ (Nithiin) ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. ఫ్లాపుల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టి, అతడిని హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా. దర్శకుడిగా విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar)కు అక్కినేని కుటుంబంలో మూడు తరాల కథానాయకులతో 'మనం' చేసే అవకాశం తెచ్చిన సినిమా. తమిళంలో సూర్యతో '24', తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా 'హలో', నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాలు చేసే అవకాశం విక్రమ్ అందుకోవడం వెనుక 'ఇష్క్' ఉందని చెప్పవచ్చు. 


'ఇష్క్' తర్వాత నితిన్, విక్రమ్ కె కుమార్ కలిసి సినిమా చేయలేదు. ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

'హనుమాన్' నిరంజన్ రెడ్డి నిర్మాణంలో...
నితిన్ హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్న తాజా సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేయనున్నారు. విక్రమ్ కె కుమార్ విషయానికి వస్తే... ఒక్కసారి చేసిన జానర్ మళ్లీ రిపీట్ చేయకుండా కొత్త జానర్ సినిమా చేయడం ఆయన అలవాటు. మరి, ఈసారి నితిన్ కోసం ఏ జానర్ మూవీ ప్లాన్ చేశారో? ప్రస్తుతానికి సినిమా ఉందని తప్ప.... అంతకు మించి ఏమీ బయటకు చెప్పడం లేదు.


Also Read'టిల్లు స్క్వేర్' రీ రికార్డింగ్ - బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా






ఈ ఏడాది (2024లో) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'హను మాన్' తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.


ఇటు నితిన్... అటు విక్రమ్...
ఇద్దరికీ విజయం చాలా అవసరం!
'ఇష్క్' సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు నితిన్ ఫ్లాపుల్లో ఉన్నారు. ఆర్ మాధవన్ హీరోగా తమిళంలో హారర్ ఫిల్మ్ '13బి' తీసి విజయం అందుకున్నారు విక్రమ్ కె కుమార్. ఆ తర్వాత తెలుగులో 'ఇష్క్' హిట్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఆయన పరిస్థితి సైతం అంత బాలేదు. నాని 'గ్యాంగ్ లీడర్' సోసోగా ఆడితే... అక్కినేని నాగ చైతన్య హీరోగా తీసిన 'థాంక్యూ' డిజాస్టర్ అయ్యింది. అయితే... ఆ తర్వాత 'దూత' వెబ్ సిరీస్ తీసి విక్రమ్ కె కుమార్, నాగచైతన్య విజయం అందుకున్నారు. కానీ, సినిమాతో హిట్ అందుకోవాల్సిన అవసరం దర్శకుడి మీద ఉంది. ఇటు నితిన్ కెరీర్ కూడా గొప్పగా లేదు. వరుస ఫ్లాపులు అతడిని వెంటాడుతున్నాయి. హిట్ చాలా అవసరం. ఫ్లాప్ ప్లస్ ఫ్లాప్ ఈక్వల్స్ టు హిట్ అవుతుందో? లేదో? వెయిట్ అండ్ సి.


నితిన్ సినిమాతో పాటు 'దూత' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ సైతం పట్టాలు ఎక్కించడానికి విక్రమ్ కె కుమార్ ప్లాన్ చేశారు. మంగళవారం అధికారికంగా 'దూత 2' అనౌన్స్ చేయనున్నారు.


Also Readమెడికల్ ఫీల్డులో పెద్ద పేరు, ఇంకా హాస్పిటల్స్ - వెంకటేష్ రెండో అల్లుడు, వియ్యంకుడి బ్యాగ్రౌండ్ తెలుసా?