యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ 2' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన '18 పేజెస్' చిత్రం కూడా పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో ఇప్పుడు ''స్పై'' అనే యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి పాన్ ఇండియన్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
'స్పై' సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, ఇంట్రో గ్లిమ్స్ ఆసక్తిని రేకెత్తించాయి. ఇందులో నిఖిల్ తొలిసారిగా ఒక గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్స్ వచ్చాయి.
SPY మేకర్స్ టైటిల్ లుక్ ని ప్రెజెంట్ చేయడంతో పాటుగా మే 12న టీజర్ ను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు జూన్ 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలియజేసారు. ఈ సందర్భంగా అసలు ఈ సినిమా దేని గురించి ఉంటుందనే విషయాన్ని అనౌన్స్ మెంట్ వీడియో రూపంలో వెల్లడించారు.
స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్ ను కనుగొనే మిషన్ నేపథ్యంలో 'స్పై' సినిమా తెరకెక్కుతోందని తెలియజేసారు. దీనికి తగ్గట్టుగానే టైటిల్ లోగోలో బోస్ చిత్ర పటాన్ని ఉంచారు. 'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడని.. ఈసారి ఇండియాలో రహస్యంగా ఉంచబడిన నిజాన్ని వెలికితీయబోతున్నాడని ఈ వీడియోలో పేర్కొన్నారు. నేతాజీ పేపర్ కటింగ్స్ కట్ చేయబడిన ఈ వీడియో క్లిప్ ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ''ఇది మరింత పెద్దదిగా ఎపిక్ గా ఉండబోతోంది. సీక్రెట్స్ వరల్డ్ లో యాక్షన్ అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉండండి. భారతదేశంలో అత్యంత రహస్యంగా ఉంచబడిన ది గ్రేట్ సుభాష్ చంద్రబోస్ ను వెలికితీసే మిషన్ లో మాతో చేరండి. SPY అనేది నేను నిజంగా నమ్మే స్టన్నింగ్ సబ్జెక్ట్'' అని పేర్కొన్నాడు. ఈ మూవీలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్ పాండే - అభినవ్ గోమతం - జిషు సేన్ గుప్తా - నితిన్ మెహతా - రవివర్మలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
'స్పై' చిత్రాన్ని చరణ్ తేజ్ ఉప్పలపాటి సమర్పణలో ED ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి నిర్మాత రాజశేఖర్ రెడ్డే కథను అందించడం విశేషం. అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. శ్రీచరణ్ పాక సంగీతం సమకూరుస్తుండగా.. అనిరుధ్ కృష్ణమూర్తి మాటలు రాస్తున్నారు. అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా.. రవి ఆంటోనీ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. దర్శకుడు గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చూసుకుంటున్నారు.
హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ లీ విటేకర్ & రాబర్ట్ లిన్నెన్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కైకో నకహారా మరియు హాలీవుడ్ డీఓపీ జూలియన్ అమరు ఎస్ట్రాడా కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు. 'కార్తికేయ 2' తో పాన్ ఇండియా వైడ్ గా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన నిఖిల్.. స్పై తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.