అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'కస్టడీ' మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలలో డైరెక్టర్ పరశురామ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు చైతన్య. అసలు ఆయన గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని అనడం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

ఇంటర్వ్యూలో 'డైరెక్టర్ పరశురామ్ తో అసలు ప్రాబ్లమ్ ఏంటి?' అని యాంకర్ ప్రశ్నించగా, దీనికి నాగచైతన్య సమాధానమిస్తూ.. "ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్. నా టైమ్ ఆయన వేస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్" అని అన్నాడు. అక్కడ రీజన్ చెప్పడానికి ఏం లేదు.. అంతా టైమ్ వేస్ట్ అని కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు చైతూ.

 

నిజానికి 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్ లో అప్పుడెప్పుడో ఓ సినిమా చేయాల్సింది. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ కమిటైన ప్రాజెక్ట్ ఇది. కథ నచ్చడంతో దర్శక హీరోలిద్దరూ కొంతకాలం ట్రావెల్ చేశారు. దీనికి 'నాగేశ్వర రావు' అనే టైటిల్ కూడా అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. అంతా ఓకే అనుకున్న తరువాత చైతూ డేట్స్ ఇచ్చాడు. వెంటనే #NC20 అనే వర్కింగ్ టైటిల్ తో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. 

 

అయితే పరశురామ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి పిలుపు రావడంతో, చైతన్య ప్రాజెక్ట్ ని డైరెక్టర్ పక్కన పెట్టేశాడు. నిర్మాతలకు నచ్చజెప్పుకొని 'సర్కారు వారి పాట' సినిమాని పట్టలెక్కించాడు. కానీ దర్శకుడు తన నెక్స్ట్ మూవీ చైతూతోనే అని చెబుతూ వచ్చాడు. థాంక్యూ ప్రమోషన్స్ లో చైతన్యను ఇదే విషయం మీద ప్రశ్నించగా.. పరశురామ్ ఈమధ్యే కలిశాడు. ఇంకా ఫుల్ స్క్రిప్ట్ నెరేషన్ ఇవ్వలేదు. అంతా రెడీ అయ్యాక సినిమా ఎప్పుడనేది చెబుతామని అన్నారు. 

 

కట్ చేస్తే, పరశురాం అదే కథను యువ హీరో విజయ్ దేవరకొండ వద్దకు తీసుకెళ్లినట్లు రూమర్స్ వచ్చాయి. దీన్ని నిజం చేస్తూ దిల్ రాజు ప్రొడక్షన్ లో VD తో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. గీతా ఆర్ట్స్ మరియు 14 రీల్స్ ని కాదని దిల్ రాజుకు సినిమా చేయడం ఏంటని ఆ మధ్య ఫిలిం సర్కిల్స్ లో డిస్కషన్స్ కూడా జరిగాయి. ఇది అటుంచితే, అన్ని నెలలు ట్రావెల్ చేసిన తర్వాత పెద్ద హీరో ఆఫర్ వచ్చిందని పరశురాం మధ్యలోనే వదిలేసి వెళ్ళడం పట్ల చైతూ హర్ట్ అయినట్లు తెలుస్తోంది.

 

పెద్ద సినీ ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఏమాత్రం గర్వం లేకుండా చాలా కూల్ గా, కామ్ గా తన పని తాను చేసుకొనిపోతుంటాడు అని ఇండస్ట్రీలో నాగచైతన్యకు మంచి పేరుంది. ఎప్పుడూ ఎవరి మీద విమర్శలు చేయటం కానీ, నెగెటివ్ కామెంట్స్ చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలాంటిది ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్ గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దర్శకుడి తీరుతో ఎంతో బాధ పడితేనే ఈ విధంగా మాట్లాడతారని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరి దీనిపై పరశురాం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

 

శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు నాగచైతన్య తెలిపాడు. కల్యాణ్ కృష్ణ తో బంగార్రాజు ఫ్రాంచైజీని కొనసాగిస్తానని అన్నారు. అలానే విక్రమ్ కె కుమార్ తో చేసిన దూత వెబ్ సిరీస్ ఎప్పుడొచ్చినా ఓటీటీలో అదరగొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు చైతూ. 'కస్టడీ' కచ్ఛితంగా హిట్ అవుతుందని.. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నానని చైతూ చెప్పుకొచ్చాడు.