Netizens Trolling On Om Raut: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తొలి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కెరీర్‌లో డిజాస్టర్ గా మిగిలిపోయింది. అంతేకాదు, ఈ సినిమాలోని క్యారెక్టర్ల లుక్ తో పాటు డైలాగ్స్ పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.


బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించిందన్న ఓం రౌత్


రీసెంట్ ‘ఆదిపురుష్’ సినిమా గురించి దర్శకుడు ఓం రౌత్ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించిందన్నారు. కొంత మంది చేసే విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. “సోషల్ మీడియా వేదికగా ముక్కు, ముఖం తెలియని వాళ్లు చేసే కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోను. ఒక సినిమా విషయంలో బాక్సాఫీస్ కలెక్షన్స్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ‘ఆదిపురుష్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడింది. తొలి రోజు దేశ వ్యాప్తంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. సినిమా లాంగ్ రన్ లో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆంధ్రా, తెలంగాణలోనే ఈ సినిమా ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది” అన్నారు.


ఓం రౌత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు


దర్శకుడు ఓం రౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ కామెంట్స్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిర్మాతలు నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టినా దాన్ని నిలుపుకోవడం విఫలం అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయని చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే ఈ సినిమా ఓ బ్లాక్ మార్క్ గా మిగిలిపోతుందటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


భారీ అంచనాలు.. తీవ్ర విమర్శలు


దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని ఆధారంగా చేసిన ‘ఆది పురుష్’ మూవీని తెరకెక్కించాడు. సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీశారు. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించారు. ప్రభాస్ రాఘవగా కనిపించగా, కృతి సనన్ జానకిగా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేషుడి పాత్రలో కనిపించాడు. గత ఏడాది జూన్ 6న విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. పలు హిందూ సంఘాలు ఈ సినిమాను నిషేధించాలంటూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దర్శకుడు ఓం రౌత్ హిందువులను కించపరిచేలా ఈ సినిమాను తెరకెక్కించారంటూ కంప్లైంట్స్ ఇచ్చారు. అంతేకాదు, ఈ సినిమాలోని పలు డైలాగులు సైతం విమర్శల పాలయ్యాయి. మొత్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.



Read Also: 'బాహుబలి', 'కేజీయఫ్‌' రికార్ట్స్‌ బ్రేక్ చేసిన చిన్న సినిమా! - బాక్సాఫీసు వసూళ్లు ఎంతంటే...