తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ డూపర్ హిట్లను సాధిస్తున్నాయి. చెప్పాలంటే మేకర్స్ కూడా లాభాలు తెచ్చిపెడుతున్న తెలంగాణ యాస చిత్రాలు చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అలాంటి సినిమాలకు ఎక్కువగా ప్రమోషన్ చేయకపోయినా సరే.. ఆటోమేటిక్‌గా ఇలాంటి కథలు సక్సెస్ ఫార్ములాగా మారిపోయాయి. అందుకే సింగర్ సునీత తనయుడు ఆకాశ్ కూడా ఇలాంటి ఒక కథతోనే హీరోగా ప్రేక్షకులకు పరిచయం అవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ‘సర్కారు నౌకరి’ అనే చిత్రంతో ఆకాశ్.. తన టాలెంట్‌ను నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ మూవీ ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో దూసుకుపోతుండగా.. ఇందులో నుండి ‘నీళ్లాబాయి’ అనే పాట తాజాగా విడుదలయ్యి అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది.
గ్రాండ్‌గా విడుదలయిన టీజర్..
‘సర్కారు నౌకరి’ చిత్రంలో ఆకాశ్‌కు జోడీగా భావనా నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత రిఫ్రెషింగ్‌గా ఉంటుందో.. ‘నీళ్లాబాయి’ లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. కొన్నిరోజుల క్రితం ‘సర్కారు నౌకరి’ టీజర్ చాలా గ్రాండ్‌గా విడుదలయ్యింది. రాఘవేంద్ర రావు స్థాపించిన ఆర్‌కె టెలీ షోకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుక జరిగింది. ఆ వేడుకలో ఈ మూవీ టీజర్ అందరి ముందుకు వచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. తన ఇన్నాళ్ల సినీ కెరీర్‌లో కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా ఎంతోమంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో సునీత కుమారుడు ఆకాశ్ కూడా చేరాడు. ఈ విషయంపై సునీత.. ‘సర్కారు నౌకరి’ టీజర్ లాంచ్ వేడుకలో ఎమోషనల్ అయ్యారు.
అప్పుడు కూతురు.. ఇప్పుడు కొడుకు..
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సునీత జర్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. అలాంటి సునీత.. తన వారసుల్లో ఒకరిని సింగర్‌గా, మరొకరిని యాక్టర్‌గా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇప్పటికే సునీత కూతురు శ్రేయా.. నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రంలో ‘టిక్ టిక్’ అనే పాట పాడి సింగర్‌గా కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్‌లో గ్రాండ్‌గా డెబ్యూ ఇచ్చేసింది. ఎప్పటికైనా సునీత గాత్రానికి వారసురాలిగా శ్రేయానే ఉంటుందని ప్రకటించింది. ఇప్పుడు అదే తోవలో కొడుకు ఆకాశ్‌ను హీరో చేసింది. అలా ఆకాశ్ మొదటి చిత్రాన్ని నిర్మించడానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ముందుకొచ్చారు.
‘నీళ్లాబాయి’ గురించి..
‘సర్కారు నౌకరి’ చిత్రానికి గంగనమోనీ శేఖర్ దర్శకత్వం వహించగా.. శాండిల్య పిసపాటి మ్యూజిక్‌ను అందించారు. ఇప్పటికే పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌కు తగినట్టుగా సంగీతాన్ని అందించగలరు అని శాండిల్యను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఈయనకు ప్రశంసలు అందుతుండగా.. మరోసారి ‘నీళ్లాబాయి’తో ఆయన స్టామినాను నిరూపించుకున్నారు. ఇక ఈ పాటలో తన స్వరంతో ఆకట్టుకుంది సోనీ కోమందూరి. కేవలం నటీనటులు మాత్రమే కాదు.. దర్శకుల దగ్గర నుండి సింగర్స్ వరకు ‘సర్కారు నౌకరి’ కోసం పనిచేసిన చాలామంది టెక్నిషియన్లు కూడా కొత్తవారే. ఇలా ఒకే సినిమాలో ఇంతమంది కొత్తవారికి అవకాశం కల్పించినందుకు రాఘవేంద్ర రావు గ్రేట్ అని మరోసారి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
Also Read: టీనేజర్లకు చూపించాల్సిన అడల్ట్ చిత్రం ఇది: ‘ఓఎమ్‌జీ 2’కు ఏ సర్టిఫికెట్‌పై అక్షయ్ కౌంటర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘Aబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial