తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, అగ్ర కథానాయిక నయనతార ప్రేమలో ఉన్నారు. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. మరి, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కొన్ని రోజుల కిందట వినిపించింది. అయితే, దానిని విఘ్నేష్ శివన్ ఖండించారు. తమకు చాలా సార్లు పెళ్లి చేశారని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఆ సంగతి పక్కన పెడితే... త్వరలో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  


తిరుమలలోని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నయనతార, విఘ్నేష్ శివన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీళ్ళిద్దరికీ రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా... ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


Also Read: 'అశోక వనంలో అర్జున కళ్యాణం' రివ్యూ : పెళ్లి కోసం ఇన్ని తిప్పలు పడాలా? విశ్వక్ సేన్ సినిమా ఎలా ఉందంటే?


తిరుమల వచ్చిన నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకునేందుకు వివాహ మండపాలను పరిశీలించారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీవారి ఆశీస్సులతో ఒక్కటి అయ్యేందుకు ప్లాన్ చేశారట. జూన్ 9న పెళ్లి జరగనుందని, ఆల్రెడీ ముహూర్తం ఖరారు అయ్యిందని టాక్. ఇప్పటివరకూ ఎప్పుడూ పెళ్లి వార్తలపై నయనతార, విఘ్నేష్ శివన్ స్పందించిన దాఖలాలు లేవు. మరి, ఈసారైనా స్పందిస్తారో? లేదో? చూడాలి. 



Also Read: డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ రివ్యూ: మార్వెల్ మంత్రం పని చేసిందా?