Nayanthara - Annapoorani Movie: సినిమాల్లో కాంట్రవర్సీలు అనేవి సహజం. ప్రతీ సినిమాలో ప్రేక్షకుల్లో ఎవరో ఒకరిని హర్ట్ చేసే అంశం ఏదో ఒకటి ఉంటుంది. అవే వివాదాలకు దారితీస్తాయి. తాజాగా నయనతార హీరోయిన్‌గా నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రంలో కూడా అలాంటి కాంట్రవర్సీలకు దారితీసే అంశాలే ఉన్నాయని.. ఈ సినిమాను బ్యాన్ చేయాలని వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ‘అన్నపూర్ణి’లో బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచే అంశాలు ఉన్నాయని కొందరు ప్రేక్షకుల వాదన. దీంతో నయనతారతో పాటు ఇతర మూవీ టీమ్ కూడా చిక్కుల్లో పడింది.


నయన్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా..
సౌత్ సినిమాల్లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అన్నపూర్ణి’. ఇది నయన్ కెరీర్‌లో 75వ సినిమా. నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్‌తో పాటు జై, కేసీ రవికుమార్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఆహార దేవత అనే ట్యాగ్‌లైన్‌తో డిసెంబర్ 1న ‘అన్నపూర్ణి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కేవలం తమిళంలో మాత్రమే విడుదలయ్యింది. సినిమా విడుదలయిన తర్వాత ఇందులో బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా అంశాలు ఉన్నాయని రాష్ట్రీయ హిందూ మహాసభకు రాష్ట్రీయ ప్రతినిధి అయిన వేలు ఆరోపించారు.


బ్రాహ్మణ కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతిన్నాయి..
‘అన్నపూర్ణి’లో నయనతార.. బ్రాహ్మిణ అమ్మాయిగా కనిపిస్తుండగా.. తనకు జంటగా నటించిన జై.. ముస్లీం అబ్బాయి పాత్రలో నటించాడు. ఈ అంశం రాష్ట్రీయ హిందూ మహాసభ మనోవాభాలను దెబ్బతీసింది. అందుకే ఈ చిత్రాన్ని ఎలాగైనా బ్యాన్ చేయాలని వేలు అన్నారు. ఒకవేళ సినిమాను బ్యాన్ చేయకపోతే.. మేకర్స్‌పై సివిల్ కేసు ఫైల్ చేయడంతో పాటు థియేటర్లను కూడా బ్లాక్ చేస్తామని ఆయన హెచ్చరించారు. హిందూ మతాన్ని టార్గెట్ చేసేలా సినిమాలు తెరకెక్కించడం కరెక్ట్ కాదని తెలిపారు. ‘అన్నపూర్ణి’ చిత్ర ప్రమోషన్స్ కోసం మూవీ టీమ్ అంతా ఎంతో కష్టపడింది. మామూలుగా తన సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార.. చెన్నైలోని ఒక గర్ల్స్ కాలేజ్‌కు వెళ్లి అక్కడ స్టూడెంట్స్‌కు బిర్యానీ వడ్డించింది. కానీ ఇప్పుడు ఈ మూవీ బ్యాన్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పలువురు ప్రేక్షకులు అనుకుంటున్నారు.


ట్రైలర్‌లోనే అలాంటి డైలాగ్..
‘అన్నపూర్ణి’ చిత్ర ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో నయనతార.. ఒక చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తను చెఫ్ అవ్వడానికి తన తండ్రి ఒప్పుకోడు. అయినా కూడా తన తండ్రి ఆదేశాలకు వ్యతిరేకంగా చెఫ్ అవ్వడమే కాకుండా ఇండియాలోనే బెస్ట్ చెఫ్ ఎవరు అనే పోటీలో పాల్గొంటుంది కూడా. అంతా బాగానే ఉన్నా.. ‘దేవుడికి ప్రసాదం అందించేవాడి కూతురు.. అదే సమయంలో మాంసం వండుతుంది అని తెలిస్తే.. భక్తులంతా ఏమనుకుంటారు’ అంటూ నయనతార తండ్రి చెప్పిన డైలాగ్.. పర్సనల్‌గా బ్రాహ్మణ కమ్యూనిటీని టార్గెట్ చేసినట్టుగా ఉంది. దీంతో మూవీ టీమ్.. ‘అన్నపూర్ణి’ థియేట్రికల్ రన్ గురించి అయోమయంలో పడింది.


Also Read: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ