ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ఆయన భార్య అలియా సిద్దిఖీ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త నవాజుద్దీన్ తనపై అత్యాచారం చేశాడని అభియోగాలు మోపింది. అంతేకాదు అందుకు సంబంధించి పక్కా ఆధారాలతో వెర్సోవా పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది అలియా. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2021 లో కూడా అలియా నవాజుద్దీన్ కు విడాకుల నోటీసులు కూడా పంపింది. అయితే ఆ నిర్ణయాన్ని తర్వాత వెనక్కి తీసుకుంది. తాజాగా తన భర్త పై అత్యాచారం ఆరోపణలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి వివరాలను సోషల్ మీడియా వేదికగా వివరించింది. ఆధారాలను కూడా పోలీసులకు అందజేశానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


సోషల్ మీడియా వేదికగా అలియా మాట్లాడుతూ.. తన భర్తపై అత్యాచారం కేసు పెట్టానని తెలిపింది. నవాజుద్దీన్ తన నుంచి కుమారుడు, కుమార్తెను వేరు చేయాలని చూస్తున్నారని ఆరోపించింది. తన పలుకుబడిని ఉపయోగించి తమని విడదీయాలని కుట్ర చేస్తున్నారని కన్నీటిపర్యంతమైంది. తన పిల్లలను అతని దగ్గరకు చేరనివ్వనని, అతను పిల్లలకు ఎప్పటికీ మంచి తండ్రి కాలేడని చెప్పింది. పిల్లలు పుట్టినప్పటినుంచీ అతను ఏనాడు పిల్లల్ని ఆదరించలేదని, ఇప్పుడు వారు పెరిగిన తర్వాత అతడి సొంతం చేసుకోవాలని చూస్తున్నాడని మండిపడింది. ఒక భార్యగా కూడా తనపై ఏనాడు నవాజుద్దీన్ ప్రేమ చూపలేదని, ఎప్పుడూ తనను గౌరవించింది లేదని చెప్పింది. అతని వల్ల తాను తన జీవితాన్ని కోల్పోయానని, అతడు పిల్లల్ని పట్టించుకోకపోయినా తాను ప్రేమగా చూసుకున్నానని, ఇప్పడు పిల్లల్ని తన నుంచి దూరం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తాను ఆర్థికంగా కూడా నష్టపోయానని, అతను తనను అన్ని విధాలుగా బలహీన పరిచాడని తెలిపింది. తనకు ఏ విధమైన సపోర్ట్ లేకపోయినా పోలీసులు, కోర్టులపై పూర్తి నమ్మకం ఉందని తనకు న్యాయం జరుగుతుందని పేర్కొంది.


గతంలో కూడా అలియా నవాజుద్దీన్ పై పలు ఆరోపణలు చేసింది. తన అత్తింట్లో చిత్ర హింసలకు గురిచేశారని, కనీసం ఆహారం కూడా అందించేవారు కాదని వాపోయింది. రూమ్ తలుపులు లాక్ చేసేవారని, కనీసం ఫుడ్ డెలివరీ బాయ్ లను కూడా ఇంట్లోకి రానిచ్చేవారు కాదని ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిగ్గా స్పందించలేదని, తన లాయర్ సహాయంతో ఫిర్యాదు చేశానని పేర్కొంది. అయితే వివాదాల కారణంగా గత కొన్నేళ్లుగా వీరు విడివిడిగానే ఉంటున్నారు. తాజాగా మరోసారి అలియా నవాజుద్దీన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అలియా సిద్దిఖీ నవాజుద్దీన్ సిద్దిఖీ కు రెండో భార్య. 2009 లో వీరి పెళ్లి జరిగింది. అలియా అసలు పేరు అంజలి కిషోర్ పాండే. పెళ్లి తర్వాత అలియా సిద్దిఖీ గా పేరు మార్చుకుంది. ముందు నుంచీ సిద్దిఖీ తో పరిచయం ఉండటం వలనే తనను పెళ్లి చేసుకున్నానని అలియా తెలిపింది. అయితే పెళ్లి అయిన కొన్నేళ్లకు వీరి మధ్య కలహాలు మొదలైయ్యాయి. తాజాగా నవాజుద్దీన్ పై అత్యాచార ఆరోపణలతో అలియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 


Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!