Naresh About Balakrishna: సీనియర్ యాక్టర్ నరేశ్.. తన పర్సనల్ లైఫ్ గురించి గానీ, ప్రొఫెషనల్ లైఫ్ గురించి గానీ ఎక్కువశాతం ఓపెన్‌గానే ఉంటారు. నరేశ్.. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరోగా ఎంతో సక్సెస్ చూసిన ఆయన.. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ హీరోలతో ఆయనకు ఉన్న బాండింగ్ గురించి చెప్తూ.. బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేశ్. అంతే కాకుండా ఒకసారి సినిమా షూటింగ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కూడా బయటపెట్టారు.
మంచి బాండింగ్..
నరేశ్ ఇంట్లో ప్రత్యేకంగా అన్ని స్పెషల్ ఫోటోలతో ఒక గ్యాలరీ ఉంది. అందులో బాలకృష్ణతో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూపిస్తూ బాలయ్యతో తనకు ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు నరేశ్. ‘‘మేము ఎన్నో ఏళ్ల క్రితం కలిశాము. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. చాలా మంచి మనిషి. ఒక్కొక్కరి టెంపర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సింహం అందంగానే ఉంటుంది. అలా అని దాని జూలు పట్టుకొని లాగలేం కదా. ఒక్కసారి బాలకృష్ణతో బాండింగ్ ఏర్పడితే ఆయన ఎంత మంచి మనిషి అని అర్థమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు నరేశ్. 90ల్లోని నటీనటులతో దిగిన ఫోటోను చూపిస్తూ.. ‘‘ఈ గ్యాంగ్ అంత సరదాగానే ఉంటుంది. మోహన్ లాల్ మంచి మ్యాజిక్ చేస్తారు. వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిపై మరొకరు జోకులు వేయడం కామన్’’ అని తెలిపారు.
చచ్చిపోయాను అనుకున్నాను..
‘ప్రేమ సంకెళ్లు’ అనే సినిమాలో మొదటిసారి బైక్‌పై స్టంట్ చేశానని చెప్పుకొచ్చారు నరేశ్. అప్పట్లో రోప్స్ లాంటివి ఏమీ లేవని, తానే స్వయంగా స్టంట్స్ చేసేవారని అన్నారు. కానీ అలా చేస్తున్నప్పుడు తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘మా అమ్మ నా చేత చాలా జంప్స్ చేయించింది. లాస్ట్ క్రాష్ ఏంటంటే 20 అడుగులు గాలిలోకి ఎగిరిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయాను. అప్పుడు నేను కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ డైట్‌లో ఉన్నాను. లేట్‌గా వచ్చానని కోపంగా చూడడంతో ఏం తినకుండా టేక్‌కు వెళ్లిపోయాం. అలా గాల్లో నుంచి కిందపడితే కుడివైపు మొహం అంతా కొట్టుకుపోయింది. అయిపోయింది, చచ్చిపోయాను అనుకున్నాను. 3 నెలలు హాస్పిటల్‌లో ఉండి అక్కడ కూడా ఎంజాయ్ చేశాను’’ అని ఆ సందర్భాన్ని వివరించారు నరేశ్.
కొడుకు దగ్గర ఏడ్చేశాను..
‘‘నాలాగా నవీన్‌కు కూడా అదే పిచ్చి వచ్చింది. మొన్న ఒక సందర్భంలో బాగా తిట్టి బైక్స్ అన్నీ అమ్మేశాను. దొంగతనంగా ఒక బైక్ దాచిపెట్టుకున్నాడు. ఒకరోజు మాత్రం వాడి దగ్గర ఏడ్చేశాను. నీకు ఏమైనా అయితే మనకు పెద్దవాళ్లు లేరు. ఒకసారి బైక్ ముట్టుకోను అని నాకు ఒట్టు పెట్టు అనగానే ఒట్టు పెట్టాడు. మంచి కొడుకు వాడు. వాడికి పవిత్ర అంటే కూడా చాలా ఇష్టం’’ అంటూ తన కుమారుడు నవీన్ గురించి చెప్పుకొచ్చారు నరేశ్. చెన్నైలో చిరంజీవి, తను ఎదురెదురు ఇళ్లల్లోనే ఉండేవాళ్లమని, అవన్నీ అద్భుతమైన జ్ఞాపకాలు అని అన్నారు. అప్పట్లో చెన్నైలో సౌత్ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఉండేదని, ఇప్పుడు ఎవరి రాష్ట్రాలకు వాళ్లు వెళ్లిపోయారని తెలిపారు నరేశ్.
Also Read: కారులో బార్.. వారెవ్వా నరేష్ కార్ల కలెక్షన్స్ చూస్తే ఔరా అంటారు, దేనికదే ప్రత్యేకం!