Nandamuri Mokshagna acting training in Vizag : నందమూరి వారసుడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఇప్పుడు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ మోక్షజ్ఞ ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు? అతని సినిమా ఎంట్రీ ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళితే..

 

ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి అనేక రకాల వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏది నిజం కాలేదు. కొద్ది సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై రకరకాల చర్చలు జరిగాయి. ఆ మధ్య మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై అసలు బాలయ్య వారసుడు హీరోగా సెట్ అవుతాడా? అనే వాదనలు సైతం వినిపించాయి. ఆ తర్వాత మోక్షజ్ఞ తన లుక్ చేంజ్ చేసుకొని ఫిట్ గా కనిపించడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. బాలయ్య వారసత్వాన్ని కొనసాగించాలంటే మోక్షజ్ఞ ప్రతి ఒక్క అంశంలో ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ నవంబర్ నుంచి వైజాగ్ లో సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. అంతేకాకుండా తన ఫిజిక్ పై కూడా దృష్టి సారిస్తూ బరువు తగ్గి సరికొత్త లుక్ లో కనపడేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ కి నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ లాంటి వారి దగ్గర మోక్షజ్ఞ శిక్షణ తీసుకోవడం విశేషం. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు, ప్రభాస్, అలాగే మరి కొంతమంది టాలీవుడ్ స్టార్స్ కి నటనలో శిక్షణ ఇచ్చారు సత్యానంద్. పవన్ కళ్యాణ్ కి నటనలో శిక్షణ ఇచ్చింది కూడా ఈయనే. అలాంటి ఆయన దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నారనే విషయం తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లయితే కచ్చితంగా మోక్షజ్ఞ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడంటూ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి 2017 లోనే మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ ఇవ్వాల్సింది. 'ఆదిత్య 369' సిక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలో చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్స్ మోక్షుని పరిచయం చేస్తున్నట్లు వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అందులోనూ ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. మరి మోక్షజ్ఞను సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే డైరెక్టర్ ఎవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇదే ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచ్ ఉండడం గ్యారెంటీ అని నందమూరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.