విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా హరికృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నటుడిగా, కథానాయకుడిగా తెరపై ఆయన కనిపించిన సందర్భాలు తక్కువ. ఆయన నటించిన సినిమాలు తక్కువైనా... తన మార్క్ చూపించారు. విలక్షణ పాత్రలతో, వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రజలను అలరించారు. సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ జయంతి (Nandamuri Harikrishna Birth Anniversary). ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి...
తెలుగు తెరపై తొలి వారసుడు
హరికృష్ణ నట ప్రయాణం పదేళ్ల వయసులో ప్రారంభమైంది. తండ్రి ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా నటించిన 'శ్రీకృష్ణావతారం'లో బాల నటుడిగా చేశారు. అందులో ఆయనది చిన్నారి కృష్ణుడి పాత్ర. ఈ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి నట వారసుడిగా హరికృష్ణ నిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ... పాటు స్వీయ దర్శకనిర్మాణంలో నటించిన 'తల్లా? పెళ్లామా', 'తాతమ్మ కల' సినిమాల్లో బాలనటుడిగా కనిపించారు. 'రామ్ రహీమ్', 'దాన వీర శూర కర్ణ' (Dana Veera Sura Karna Movie) సినిమాలు చేశారు.
బాలకృష్ణకు అన్నయ్యగా... స్నేహితుడిగా!
నిజ జీవితంలో అన్నదమ్ములైన హరికృష్ణ, బాలకృష్ణ... 'తాతమ్మ కల' చిత్రంలో కూడా అన్నదమ్ములగా కనిపించారు. అందులో బాలకృష్ణకు అన్నయ్య పాత్ర చేసిన హరికృష్ణ... ఆ తర్వాత 'రామ్ రహీమ్'లో స్నేహితుడిగా నటించారు.
ఇరవై ఏళ్ళ విరామం తర్వాత...
నందమూరి అభిమాని దర్శకత్వంలో!
'దాన వీర శూర కర్ణ'లో అర్జునుడిగా నటించిన హరికృష్ణ, ఆ తర్వాత నటనకు పూర్తిగా దూరమయ్యారు. మళ్ళీ ఆయనను ఎన్టీఆర్ వీరాభిమాని, దర్శకుడు వైవీఎస్ చౌదరి కెమెరా ముందుకు తీసుకొచ్చారు. అక్కినేని నాగార్జున, హరికృష్ణ ప్రధాన పాత్రల్లో 'సీతారామ రాజు' తెరకెక్కించారు. దర్శకుడు ఎన్. శంకర్ తీసిన 'శ్రీ రాములయ్య' చిత్రంలో అతిథి పాత్ర కామ్రేడ్ సత్యం చేశారు. ఆ రెండు సినిమాలు హరికృష్ణకు మంచి పేరు తీసుకొచ్చాయి.
'సీతయ్య'తో స్టార్‌డమ్
'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో హరికృష్ణకు విజయమే కాదు... ఉత్తమ నటుడిగా నంది పురస్కారం లభించింది. ఇక, ఆ తర్వాత వచ్చిన 'సీతయ్య'తో హరికృష్ణకు స్టార్‌డమ్ వచ్చింది. మాస్ హీరోగానూ ఆయన అలరించారు. ఈ రెండు చిత్రాలకూ వైవీఎస్ చౌదరి దర్శక నిర్మాత. హరికృష్ణతో ఆయన తీసిన మూడు సినిమాలూ మంచి విజయాలు సాధించాయి. 'సీతయ్య' తర్వాత 'టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్', 'స్వామి', 'శ్రావణమాసం' సినిమాలు మాత్రమే చేశారు. నటుడిగా తన చివరి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణతో హరికృష్ణ నటించారు. అందులో త్రిమూర్తులు పాత్ర చేశారు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
విజయవంతమైన హీరోలుగా హరికృష్ణ వారసులు
హరికృష్ణకు ముగ్గురు తనయులు. అందులో ఇద్దరు హీరోలుగా విజయాలు అందుకుంటున్నారు. ముగ్గురిలో చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్ అగ్ర హీరోగా ఎదిగారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఇటీవల 'బింబిసార' సినిమాతో భారీ విజయం అందుకున్నారు. వీళ్ళిద్దరితో కలిసి హరికృష్ణ ఒక సినిమా చేయాలనుకున్నారని వార్తలు వినిపించాయి. నందమూరి అభిమానులు సైతం తండ్రీ తనయులు కలిసి ఓ సినిమాలో కనిపించాలని కోరుకున్నారు. చివరకు, ఆ కోరిక కలగా మిగిలింది.
Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?
రాజకీయాల్లోనూ నందమూరి హరికృష్ణ తనదైన ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తండ్రితో పాటు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించిన బండిని స్వయంగా నడిపారు. హిందూపూర్ నియోజకవర్గం నుంచి 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించారు. ఆయన పెద్ద కుమారుడు జానకి రామ్ సైతం అంతకు ముందు రోడ్డు ప్రమాదం కారణంగా మరణించారు. తమ కుటుంబంలో జరిగిన ప్రమాదాలు ఇంకెవరికీ జరగకూడదని ప్రతి సినిమాలో ప్రేక్షకులకు ఎన్టీఆర్ జాగ్రత్తలు చెబుతారు.
Also Read : ఎన్టీఆర్ ఏడాది క్రితమే హైదరాబాద్ శివార్లలో ఆ ల్యాండ్ కొన్నారు - ఇప్పుడు అక్కడ