Nandamuri Balakrishna Gets Place In World Book Of Records: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR) గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరును తాజా చేర్చారు. తన అత్యంత ప్రతిష్టాత్మక గౌరవాల్లో ఒకటైన దీన్ని బాలయ్యకు అందించింది. దీంతో భారతీయ సినిమాలో ఓ అత్యున్నత గౌరవం ఆయనకు దక్కినట్లయింది. భారతీయ సినిమాలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా... యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరును చేర్చి సత్కరిస్తారు. ఈ వేడుక ఈ నెల 30న హైదరాబాద్‌లో జరగనుంది.
'భారతీయ సినిమాలో ప్రధాన హీరోగా 50 ఏళ్లకు పైగా మీ అద్భుత నటన, సినీ కళామతల్లికి మీరు చేసిన సేవను గుర్తించడం మాకు ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలో మీ అంకిత భావం, ప్రతిభ, శాశ్వత ఉనికికి నిదర్శనం. ఇది లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. 5 దశాబ్దాల సినీ ప్రయాణంలోనే కాకుండా 15 ఏళ్లుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్‌గా సమాజానికి మీరు చేసిన నిరంతర సేవను గుర్తించి మీ పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. మీ అసాధారణ విజయాలకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఈ ప్రపంచ వేదిక ద్వారా మీ వారసత్వాన్ని గౌరవించాలని ఎదురుచూస్తున్నాం. మీ నిరంతర విజయానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
50 ఏళ్ల సినీ ప్రయాణంలో లెజెండ్
గత 50 ఏళ్లుగా బాలయ్య తన సినీ ప్రయాణంలో హీరోతో పాటు ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. ప్రపంచ సినిమాలో చెప్పుకోదగ్గ అతి కొద్దిమంది గొప్ప నటుల్లో ఒకరిగా నిలిచారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ వారసత్వాన్ని సినిమాల్లో కొనసాగిస్తూనే తన అద్భుత నటనతో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. ఎన్నో చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం పొంది జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు.
Also Read: కాంతార చాప్టర్ 1... తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బిజినెస్ డీల్ - టాలీవుడ్ టాప్ హీరోలకు ఈక్వెల్
అవార్డులివే...
బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. సినిమా, సమాజానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ను ఇచ్చి సత్కరించింది. ఇటీవల ఆయన నటించిన చిత్రం 'భగవంత్ కేసరి' ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ ఎడిషన్‌లో చోటు దక్కించుకుని సత్తా చాటారు.
అసలేంటి WBR?
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. లండన్‌లో ప్రధాన కార్యాలయం కాగా... యూకే, USA, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, యూఏఈలో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇస్తుంది. ఈ జాబితాలో బాలకృష్ణకు చోటు ఇస్తూ... ఆయన 5 దశాబ్దాలుగా సినీ పరిశ్రమ, సమాజానికి చేసిన కృషిని వివరించింది. ఈ మేరకు 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' సీఈవో సంతోష్ శుక్లా అధికారిక ప్రశంసా పత్రం జారీ చేశారు.