Rishab Shetty's Kantara Chapter 1 Big Deal In Ap Telangana: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన 'కాంతార' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఈ మూవీకి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' తెరకెక్కుతుండగా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
మూవీ క్రేజ్ దృష్ట్యా బిజినెస్ డీల్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోస్, లుక్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మన మట్టి కథను ప్రపంచానికి చూపించేందుకు మూడేళ్లు పాటు శ్రమించినట్లు చెప్పిన రిషబ్ శెట్టి... తాజాగా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాళీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బిజినెస్ డీల్
తెలుగు రాష్ట్రాల్లోనూ 'కాంతార చాప్టర్ 1' రైట్స్ కోసం భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో హక్కుల కోసం దాదాపు రూ.100 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇది టాలీవుడ్ టాప్ హీరోల పెద్ద చిత్రాల బడ్జెట్‌కు సమానం. నైజాంలో రూ.40 కోట్లు, కోస్తాంధ్రలో రూ.45 కోట్లు, సీడెడ్‌లో రూ.15 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ భారీ సక్సెక్ కావడం, అంచనాలు భారీగా ఉండడంతో ఇంతటి స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: ఓ వీడియో గేమ్... రాయలసీమ నుంచి ప్రపంచం అంతం - తేజ సజ్జ 'జాంబీ రెడ్డి' సీక్వెల్ అనౌన్స్
2022లో వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' తెరకెక్కుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో 'సప్త సాగరాలు దాటి' ఫేం హీరోయిన్‌గా నటిస్తున్నారు. కనకవతి పాత్రలో ఆమె కీ రోల్ ప్లే చేస్తుండగా... రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తుండగా... అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి మొదలైందో దానికి ముందు జరిగిన సంఘటనలను చూపించనున్నారు.
'కాంతార'లో పుంజుర్లి దేవునికి సంబంధించి కొంత భాగం చూపించగా... ప్రీక్వెల్‌లో దాన్ని మించి ఆ దేవునికి సంబంధించి పూర్తి వివరాలు చూపించనున్నట్లు తెలుస్తోంది. 'మన ఊరు... మన జనం... మన నమ్మకాలు... మన మట్టి కథ' అంటూ భారీ సెట్స్, యుద్ధ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
మూడో పార్ట్ కూడా...
ఇక ఈ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ కూడా రానుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. మూడో పార్ట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా భాగం కానున్నారనే వార్తలు హల్చల్ చేస్తుండగా... అదే జరిగితే కన్నడలోనూ ఎన్టీఆర్ క్రేజ్ స్టార్ట్ అవుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.