Prasanth Varma To Direct Teja Sajja For Zobie Reddy 2: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ తనదైన డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో దూసుకెళ్తుంటారు. ఆయన హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి, 'హను-మాన్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా 2021లో వచ్చిన జాంబీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో తెరకెక్కించిన ఫస్ట్ జాంబీస్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు తాజాగా దీనికి సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే...
తేజ సజ్జ హీరోగా 'జాంబీ రెడ్డి 2' మూవీని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఓ వీడియో గేమ్ కంట్రోలర్‌ను పట్టుకున్న చేతిని చూపిస్తూనే... 'రాయలసీమ నుంచి ప్రపంచం అంతం వరకూ...' అంటూ ఆసక్తికర ట్యాగ్ లైన్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించనుండగా... 'గతంలో కంటే బలంగా... ఎప్పుడూ లేనంత క్రూరంగా...' అంటూ క్యాప్షన్ ఇస్తూనే భారీ హైప్ క్రియేట్ చేసింది. 2027లో ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: పరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!
కాన్సెప్ట్ అదేనా?
2021లో వచ్చిన జాంబీ రెడ్డి ఆద్యంతం ఆసక్తికర కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ సైంటిస్ట్ ప్రయోగం వికటించి ప్రమాదకర వైరస్‌తో ఊరు ఊరంతా జాంబీలుగా మారతారు. కరోనా వైరస్ తర్వాత జరిగిన పరిణామాలను ఇందులో చూపించారు. వీడియో గేమ్ డిజైన్ చేసే హీరో అనుకోని కారణాలతో ఆ గ్రామానికి వెళ్లగా... అతని ఫ్రెండ్ జాంబీ వైరస్ బారిన పడతాడు. అనుకోకుండా ఊరంతా ఆ వైరస్ వ్యాపించి చాలామంది గ్రామస్థులు జాంబీలుగా మారతారు. అప్పుడు హీరో ఆ వైరస్‌కు విరుగుడును ఆ ఊరి శివాలయంలోనే కనుక్కుంటాడు. దీనికి సీక్వెల్‌ను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించనున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు, టెక్నికల్ టీంను వెల్లడించనున్నారు.
ప్రస్తుతం తేజ సజ్జా సూపర్ సూపర్ అడ్వెంచర్ మూవీ 'మిరాయ్' పనుల్లో బిజీగా ఉన్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా... మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు 8 భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో సెప్టెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రెండో ప్రాజెక్టుగా 'జాంబీ రెడ్డి 2' ట్రాక్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది.