Nana Patekar Video : బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్(Nana Patekar) తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ తీసుకోడానికి వచ్చిన అభిమాని పై నానాపటేకర్ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే? బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తన విలక్షణమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు నానాపటేకర్. ఇటీవల వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'ది వాక్సిన్ వార్(The Vaccion War) మూవీ లో కీలక పాత్ర పోషించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


ఇదిలా ఉంటే నానాపటేకర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తనతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన ఓ అభిమాని పై చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటన వారణాసిలో జరిగినట్లు తెలుస్తోంది. నానా పటేకర్ 'జర్నీ' సినిమా షూటింగ్లో భాగంగా ప్రస్తుతం వారణాసిలో పర్యటిస్తున్నారు. వారణాసి వీధుల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడి వాళ్ళందరూ నానా పటేకర్ ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే ఆయన దగ్గరకు వెళ్లిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో నానా పటేకర్ అసహనానికి గురై అతడి తలపై గట్టిగా కొట్టారు.






అంతేకాకుండా సినిమా యూనిట్ లోని ఓ వ్యక్తి ఆ యువకుడి కాలర్ పట్టుకుని అందరూ చూస్తుండగానే బయటికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా ఈ వీడియో పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోలో నానా పటేకర్ ప్రవర్తన పై నెటిజన్స్ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ వీడియో కింద..' సెల్ఫీ ఇవ్వడం నచ్చకపోతే ఇవ్వను అని చెప్పాల్సింది. ఇలా అందరి ముందు కొట్టడం కరెక్ట్ కాదు', 'నానాపటేకర్ ఇలా చేయడం సరైంది కాదు', 'షూటింగ్ మధ్యలో సెల్ఫీ తీసుకోవాలని అనుకోవడం ఆ యువకుడి తప్పే. అలాగే అతన్ని కొట్టడం నానాపటేకర్ తప్పు' అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. వీరిలో చాలామంది నెటిజన్స్ యువకుడి పట్ల నానా పటేకర్ దురుసుగా ప్రవర్తించడం సరికాదని చెప్పుకొచ్చారు.


గతంలో కూడా పలువురు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించి పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో సీనియర్ నటుడు నానాపటేకర్ చేరడం ఒకింత షాకింగ్ గా మారింది. ఇక నానా పటేకర్ విషయానికొస్తే.. 'దీక్ష', 'మెహ్రే', 'అభయ్', 'గ్యాంగ్', 'బూత్', 'రాజ్ నీతి', 'గోల్ మాల్ అగైన్', 'కాలా' తదితర చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అనీల్ శర్మ దర్శకత్వం వహిస్తున్న 'జర్నీ' అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గానే 'గదర్ 2'(Gadar2) తో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్నారు అనిల్ శర్మ. 'గదర్ 2' తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో 'జర్నీ' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Also Read : బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపుతున్న‘టైగర్‌ 3’, మూడు రోజుల్లో వసూళ్ల సునామీ - ఎంత వచ్చిందంటే?