Naa Saami Ranga Non Theatrical Business: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున. హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో పలు చిత్రాల్లో నటించారు. నాగార్జునకు సౌత్ తో పాటు నార్త్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించడం లేదు. ప్రస్తుతం నాగార్జున ‘నా సామిరంగ’ అనే సినిమా చేస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తో కలిసి ఆయన ఈ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అవుతోంది. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్న మూవీ కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ  నాన్ థియేట్రికల్ రైట్స్ కు మాంచి ఫ్యాన్సీ రేటు దక్కినట్లు తెలుస్తోంది.


‘నా సామిరంగ’ నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ. 32 కోట్లు


ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘నా సామిరంగ’ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ. 32 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కోసం ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. స్టార్ మా శాటిలైట్ హక్కులని, హాట్ స్టార్ కి డిజిటల్ హక్కులని కొనుగోలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 45 కోట్లు కాగా, నాన్ థియేట్రికల్ రైట్స్ కి రూ. 32 కోట్లు వచ్చాయి. అంటే, మూవీ కోసం పెట్టిన బడ్జెట్ లో మూడొంతుల మేర డబ్బులు వచ్చేసినట్లు అయ్యింది. అటు థియేట్రిక్ బిజినెస్ కూడా దాదాపు అన్ని ఏరియాల్లో పూర్తి అయినట్లు తెలుస్తోంది. అంటే ‘నా సామిరంగ’ నిర్మాతలకు సినిమా విడుదలకు ముందే లాభాలు మొదలైనట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో నాగార్జునకు  సంక్రాంతి సెంటిమెంట్ మళ్లీ కలిసి వచ్చినట్టు అయ్యింది.


నాగ్ ఆశలన్నీ ‘నా సామిరంగ’ మీదే!


ఇక ‘నా సామిరంగ’ చిత్రాన్ని విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై   శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మలయాళీ  హిట్ చిత్రం ‘పొరింజు మరియం జోస్‌’కి రీమేక్ గా రూపొందుతోంది. త్రిస్సూర్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా తీర్చిదిద్దారు. నాగార్జున నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఆయన ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారు. ‘నా సామిరంగ’ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: అమ్మకు హిందీ రాదు, నాకు తెలుగు రాదు - ‘దేవర’ సెట్‌లో నన్ను ‘టేప్ రికార్డ్’ అని ఆటపట్టిస్తున్నారు: జాన్వీ కపూర్