Kangana Ranaut about Vikrant Massey: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంది అని పేరు తెచ్చుకుంది. తన బోల్డ్ క్యారెక్టర్‌ను, మాట్లాడే మాటలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో.. వాటిని ఇష్టపడని ప్రేక్షకులు కూడా అంతే ఉన్నారు. తాజాగా కంగనా పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. ఒకప్పుడు ఒక హీరోను బొద్దింక అని తిట్టి.. ఇప్పుడు అదే హీరో యాక్టింగ్ బాగుందంటూ, సినిమా చూస్తూ ఏడ్చేశానంటూ కంగనా పెట్టిన పోస్టే దీనికి కారణం. ఈ హీరో మరెవరో కాదు.. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన యాక్టింగ్‌తో జెండా పాతేసిన విక్రాంత్ మాస్సే.


‘12త్ ఫెయిల్’కు కంగనా రివ్యూ..
ముందుగా సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బుల్లితెరతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు విక్రాంత్ మాస్సే. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో తనకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు దక్కాయి. పాత్ర చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా యాక్టింగ్ పరంగా పూర్తిస్థాయిలో న్యాయం చేసేవాడు విక్రాంత్. ఇక విక్రాంత్ ఇన్నాళ్ల కష్టానికి ‘12త్ ఫెయిల్’తో ఫలితం దక్కింది. ఈ మూవీ ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలయ్యి బాలీవుడ్ పేరునే నిలబెట్టింది. ముఖ్యంగా విక్రాంత్ నటనే ఈ సినిమాను నిలబెట్టిందని చాలామంది ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం మునుపెన్నడూ ఇలాంటి ఒక ఇన్‌స్పైరింగ్ సినిమా చూడలేదని రివ్యూలు ఇచ్చారు. తాజాగా కంగనా కూడా ఈ మూవీ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.


ఇర్ఫాన్ ఖాన్ లేని లోటును తీరుస్తాడు..
‘చాలా అద్భుతమైన సినిమా. ఒక జనరల్ క్యాస్ట్ స్టూడెంట్‌గా, పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయిగా.. హిందీ మీడియంలో చదువుకొని స్కూల్‌లో ఉన్నన్ని సంవత్సరాలు ఏ రిజర్వేషన్స్ లేకుండా కష్టపడిన నేను.. ఈ సినిమా మొత్తం ఏడుస్తూనే ఉన్నాను. ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడూ ఇంతలా ఏడవలేదు. నా తోటి ప్రయాణికులంతా ఏమైందా అని నావైపు జాలిగా చూస్తున్నారు. నాకు ఇబ్బందిగా అనిపించింది’ అంటూ ‘12త్ ఫెయిల్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది కంగనా రనౌత్. అంతే కాకుండా విక్రాంత్ మాస్సే నటనను ఇర్ఫాన్ ఖాన్ నటనతో పోల్చింది. తను ఇర్ఫాన్ ఖాన్ లేని లోటును తీరుస్తాడని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దర్శకుడు విధు వినోద్ చోప్రా తన మనసును గెలుచున్నాడని చెప్పుకొచ్చింది కంగనా. విక్రాంత్‌ను కంగనా ఇంతగా ప్రశంసిస్తుండడంతో ఒకప్పుడు తనను ‘బొద్దింక’ అని పిలిచిన ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.






కంగనా యాక్షన్.. విక్రాంత్ రియాక్షన్..
కొన్నేళ్ల క్రితం హీరోయిన్ యామీ గౌతం పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ.. ‘రాధే మాలాగా స్వచ్ఛంగా ఉంది’ అంటూ విక్రాంత్ మాస్సే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కంగనాకు నచ్చలేదు. ‘ఈ బొద్దింక ఎక్కడి నుండి వచ్చింది? నా చెప్పులు తీసుకురండి’ అంటూ కౌంటర్‌గా పోస్ట్ వేసింది. కానీ దాంట్లో విక్రాంత్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అయినా విక్రాంత్ మాస్సేను ఉద్దేశించే కంగనా ‘బొద్దింక’ అనే పదం ఉపయోగించిందని నెటిజన్లను అర్థమయ్యింది. కొన్నాళ్ల తర్వాత ఈ విషయంపై విక్రాంత్ స్పందిస్తూ.. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని, నెగిటివిటీని జీవితంలోకి రానివ్వనని చెప్తూ కూల్‌గా రియాక్ట్ అయ్యాడు. జ్ఞానంలేని వారికి జ్ఞానం లభించాలని కోరుకోవడం తప్పా ఏమీ చేయలేమని అన్నాడు.


Also Read: ‘గుంటూరు కారం’ సెన్సార్ రిపోర్ట్ - ఫస్ట్ హాఫ్ మరీ అలా ఉందా?