Nagarjuna Speech In Coolie Pre Release Event: మూవీ సెట్స్‌లో ఎప్పుడూ బోర్ కొట్టకుండా ఉండాలంటే... ఎప్పటికప్పుడు ప్రయోగాత్మకంగా అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయాలని కింగ్ నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. తన కెరీర్‌లో చాలా ప్రయోగాలు చేశానని... దెబ్బలు తిన్నా కూడా మంచి విజయాలు సాధించినట్లు గుర్తు చేసుకున్నారు. 

విలన్‌గా అందుకే ఒప్పుకొన్నా...

'నిన్నే పెళ్లాడతా' వంటి లవ్ ఎంటర్‌టైనర్ తర్వాత 'అన్నమయ్య' చేస్తుంటే 'ఇప్పుడెందుకు ఇలాంటి సబ్జెక్ట్' అంటూ అందరూ వెనక్కి లాగే ప్రయత్నం చేశారని... అప్పుడప్పుడు ఛాలెంజింగ్‌గా డిఫరెంట్ రోల్స్ చేయాలని నాగార్జున అన్నారు. 'లోకేశ్ ఓరోజు నన్ను కలిసి విలన్‌గా చేస్తానంటే స్టోరీ చెబుతా అన్నారు. ఆయన 'ఖైదీ' చూసిన తర్వాత ఎప్పటికైనా లోకేశ్‌తో చేయాలని అనుకున్నా. 'కూలీ' స్టోరీ చెప్పిన తర్వాత నాకు ఆ రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సైమన్ రోల్ నిజంగా హీరోలాంటిది.

నా కెరీర్‌లోనే ఫస్ట్ టైం లోకేశ్ స్టోరీ చెబుతుంటే రికార్డు చేసుకుని ఇంటికి వెళ్లి మళ్లీ విన్నా. కొన్ని మార్పులు చెప్తే లోకేశ్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుని 'సైమన్' పాత్రను డెవలప్ చేశారు. అది నాకు చాలా నచ్చింది. రజినీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ సినిమాల్లో మంచివాళ్లగానే నటిస్తే బాగుండదు కదా.' అంటూ నాగ్ నవ్వులు పూయించారు.

Also Read: ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ - సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ వార్... కాంప్లికేట్ చెయ్యొద్దంటూ...

అంత క్రూరంగా ఉంటారు

గతంలో మూవీకి సంబంధించిన ఓ వీడియో లీక్ కావడంపై నాగార్జున స్పందించారు. వైజాగ్‌లో ఫస్ట్ షూట్ జరిగిందని... రెండో రోజు షూటింగ్ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని తెలిపారు. ఇది చూసి 'మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా?' అనిపించిందని చెప్పారు. 'లోకేశ్ చాలా కూల్‌గా ఉంటారని... అందుకే అందరూ ఆయనతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సన్ పిక్చర్స్ ఇచ్చిన బడ్జెట్‌లో రూ.5 కోట్లు మిగిల్చి మరీ మూవీ పూర్తి చేశారు. చాలా వరకూ సీన్స్ సింగిల్ టేక్‌లోనే ఓకే అయిపోయేవి. నాది మూవీలో నెగిటివ్ రోల్ అయినా ఆ పాత్ర చేసిన ఎక్స్‌పీరియన్స్ చాలా పాజిటివ్‌గా ఉంది.' అని అన్నారు.

రజినీ సార్‌ది గొప్ప మనసు

సెట్‌లో రజినీ సార్ తనతో వచ్చి స్వయంగా మాట్లాడారని.. ఆయన కలిసినప్పుడు అలానే చూస్తూ ఉండిపోయినట్లు చెప్పారు నాగార్జున. 'థాయ్‌లాండ్‌లో 17 రోజులు రాత్రి పూట యాక్షన్ సీక్వెన్స్ తీశాం. దాదాపు 350 మంది శ్రమించారు. లాస్ట్ డే రజినీ సార్ అందరినీ పిలిచి తలో ప్యాకెట్ ఇచ్చి 'ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలకు ఏదైనా తీసుకెళ్లండి' అంటూ చెప్పారు. ఆయనది అంత గొప్ప మనసు. సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్. శ్రుతిహాసన్ అందరూ చాలా గొప్పగా నటించారు.' అంటూ ప్రశంసించారు.

నాగార్జున నటించిన చిత్రాల పేర్లు కూలీలో ఎవరెవరికి సరిపోతాయని అడగ్గా... డాన్ - రజినీకాంత్, గీతాంజలి - శ్రుతిహాసన్, కిల్లర్ - సైమన్ (నాగార్జున), క్రిమినల్ - సత్యరాజ్ (మంచి క్రిమినల్) అంటూ నవ్వులు పూయించారు నాగ్. ఈ మూవీ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.