Nag Ashwin: అందరూ ఊహించినట్టుగానే ‘కల్కి 2898 AD’ మూవీ ఓ రేంజ్‌లో సక్సెస్‌ను అందుకుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం ఒక రేంజ్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ‘కల్కి 2898 AD’ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమయ్యి, షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదల అవ్వడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలో మూవీ టీమ్ అంతా చాలా కష్టపడింది. అయితే ‘కల్కి 2898 AD’ తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన సందర్భంగా ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కష్టాలను గుర్తుచేసుకున్నాడు నాగ్ అశ్విన్.


కేవలం రెండు సినిమాలు..


‘కల్కి 2898 AD’లోని ప్రతీ అంశాన్ని ప్రేక్షకులు విపరీతంగా ప్రశంసిస్తున్నారు. క్యాస్టింగ్ దగ్గర నుండి విజువల్స్, టెక్నాలజీ వరకు అన్ని అంశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్‌కు రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. అయినా ‘కల్కి 2898 AD’ లాంటి ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ను చాలా బాగా హ్యాండిల్ చేసి అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. కానీ దర్శకుడిగా తను మొదటి సినిమా అవకాశం కోసం ఎంత కష్టపడ్డాడో తాజాగా బయటపెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్.


పదేళ్ల క్రితం..


‘కల్కి 2898 AD’తో దర్శకుడిగా నాగ్ అశ్విన్ ఎంత సక్సెస్ అయ్యాడో.. నిర్మాతలుగా స్వప్న దత్, ప్రియాంక దత్ కూడా అంతే సక్సెస్‌ను అందుకున్నారు. దీంతో తాము ముగ్గురం కలిసి ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టామని బయటపెట్టాడు నాగ్ అశ్విన్. ‘‘పదేళ్ల క్రితం మేము ముగ్గురు మా మొదటి ఫీచర్ ఫిల్మ్ అయిన ఎవడే సుబ్రహ్మణ్యంను కలిసి మొదలుపెట్టాం. ఈ సినిమా కోసం వైజయంతి చాలా రిస్క్ తీసుకుంది. నాకు బాగా గుర్తున్న సందర్భం ఏంటంటే మేము ఒకరోజు 20 మందితో షూటింగ్ ప్లాన్ చేయగా ఆరోజు వర్షం పడింది. మేము షూటింగ్ పూర్తి చేయలేయమని, మళ్లీ వచ్చి అంతా సెట్ చేయాలని అర్థమయ్యింది. ఊహించని ఆ ఖర్చు మమ్మల్ని చాలా భయపడేలా చేసింది. చెప్పాలంటే అది పెద్ద ఖర్చేమీ కాదు’’ అని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్.






చరిత్రలో మైల్‌స్టోన్..


‘‘అక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చాం. పదేళ్ల తర్వాత మేము కలిసి చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ అవ్వడం మాత్రమే కాకుండా చరిత్రలో ఏదో ఒక విధమైన మైల్‌స్టోన్‌లాగా నిలిచిపోయింది. వీరిద్దరి మధ్య నిలబడడం, అసాధ్యమైన పనులను సాధ్యం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇది చాలా చిన్నది. మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉంది. చేసుకుంటాం కూడా’’ అని తెలిపాడు నాగ్ అశ్విన్. ఈ పోస్ట్‌కు సినీ సెలబ్రిటీలు సైతం లైక్ చేస్తూ..  ‘కల్కి 2898 AD’ సక్సెస్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు.



Also Read: ‘కల్కి‘లో అర్జునుడిగా అలరించిన విజయ్‌ దేవరకొండ - ఈ మూవీకి అతడు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?