సినీ పరిశ్రమలో బయోపిక్స్‌కు ఉండే క్రేజే వేరు. కేవలం మేకర్స్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా బయోపిక్స్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంది కాబట్టే.. అవి మినిమమ్ గ్యారెంటీ హిట్ ఫార్ములాలాగా నిలుస్తాయి. తాజాగా శ్రీలంకకు చెందిన బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా ‘800’ అనే చిత్రం తెరకెక్కింది. క్రికెట్ హిస్టరీలోనే ముత్తయ్య మురళీధరన్ తీసిన వికెట్లు ఎవరూ తీయలేకపోయారు. 800 వికెట్లతో బౌలర్‌గా, స్పిన్నర్‌గా తన పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మరో లెజండరీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్ ఘనతలను మరోసారి గుర్తుచేసుకున్నారు.


క్రికెట్టే జీవితం..
ముత్తయ్య మురళీధరన్ జీవితాన్ని సినిమా రూపంలో ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచన.. ముందుగా దర్శకుడు ఎంఎస్ శ్రీపతికి వచ్చింది. తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత తెలుగులో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ దీనిని సమర్పించారు. అక్టోబర్ 6న కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ‘800’ విడుదల అవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘800’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్. బాల్యం నుంచి రిటైర్ అయ్యే వరకు, ఇప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటర్ కూడా! ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్‌కు క్రికెట్టే జీవితం’’ అని మురళీధరన్‌ను ప్రశంసించారు.


హైదరాబాద్ చాలా స్పెషల్..
ముత్తయ్య మురళీధరన్ కూడా వీవీఎస్ లక్ష్మణ్‌తో తనకు ఉన్న స్నేహం గురించి ‘800’ ఈవెంట్‌లో మాట్లాడారు. తనతో కలిసి ఆడిన రోజులను గుర్తుచేసుకున్నారు. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి అని ప్రశంసించారు. ‘‘హైదరాబాద్ నాకు స్పెషల్... నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు.’’ అంటూ సన్‌రైజర్స్‌తో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పుడే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి మురళీధరన్‌కు ప్రశ్న ఎదురయ్యింది. అయితే ఆ టీమ్‌కు వెంకటేశ్ కెప్టెన్ అయితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. 


రెండున్నర గంటల మేకప్..
‘800’లో ముత్తయ్య మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఈ పాత్రలో నటించడం కోసం బౌలింగ్ ప్రాక్టీస్ చేశానని అన్నాడు మిట్టల్. అదే సమయంలో తన చేతికి గాయమయ్యిందని చెప్పాడు. బౌలింగ్ కంటే ముత్తయ్య మురళీధరన్ లుక్ రావడం కోసం కష్టపడ్డామని అన్నాడు. ఈ విషయంలో మేకప్ టీమ్, డైరెక్షన్ టీమ్ అందరికీ క్రెడిట్ ఇవ్వాలన్నాడు. లుక్ కోసం మేం ప్రతి రోజూ రెండున్నర గంటలు కష్టపడ్డామని తెలిపాడు. ‘800’ సినిమాను థియేటర్లలో చూడమని కోరాడు. ముత్తయ్య మురళీధరన్ గురించి చాలామందికి తెలిసినా.. ఆయన రికార్డుల గురించి ఐడియా ఉన్నా.. పూర్తిగా ఆయన జీవితంలో జరిగిన విషయాల గురించి మాత్రం చాలామందికి తెలియదు. దానికోసమే ‘800’ చిత్రం చూడాలని క్రికెట్ లవర్స్ అనుకుంటున్నారు.


Also Read: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial