Chandrababu Naidu Arrest: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేయడం, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉండటంతో పాటు గతంలో ఎన్డీయే కూటమికి కన్వీనర్‌గా పనిచేసి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడంతో.. ఆయన అరెస్ట్‌పై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే జాతీయ నేతలతో పాటు రజనీకాంత్, విశాల్ లాంటి హీరోలు స్పందించారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై హీరో సుమన్ రియాక్ట్ అయ్యాడు.


హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో సుమన్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో బాబు అరెస్ట్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో చంద్రబాబుకు టైమ్ బాగాలేదని, అన్నీ అనుకూలంగా మారేవరకు జైల్లో ఉంటారంటూ సుమన్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపించారని చాలామంది అంటున్నారని, అందులో నిజం లేదని వ్యాఖ్యానించాడు. చంద్రబాబు లాంటి మాజీ సీఎంను అరెస్ట్ చేసేటప్పుడు అన్నీ ఆలోచించే చర్యలు తీసుకుంటారని తెలిపాడు. అన్నీ బాగా లేనప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయని, సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలాంటి జరుగుతాయని సుమన్ చెప్పుకొచ్చాడు.


దేనికైనా టైం అనేది కలిసి రావాలని, చంద్రబాబుకు టైం కలిసి వచ్చేంతవరకు జైల్లోనే ఉంటారని సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశాబే. టైం బాగున్నప్పుడు లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగా జరిపోతాయని, బాలేనప్పుడే ఇలాంటి జరుగుతాయన్నాడు. చంద్రబాబు పుట్టిన తేదీ ఆధారంగా జ్యోతిష్యుడిని అడిగితే ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  అరెస్ట్ కావడం రాజకీయాల్లో ఆయనకు ఒక గుణపాఠం అని సుమన్ తెలిపాడు. చంద్రబాబు అరెస్ట్ గురించి సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. చంద్రబాబు అరెస్ట్‌పై సుమన్ భిన్నంగా స్పందించారు. అటు చంద్రబాబుకు మద్దతు తెలపలేదు, ఇటు జగన్ కు సానుకూల వ్యాఖ్యలు చేయలేదు.


చంద్రబాబు అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. చంద్రబాబుతో ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉండటంతో ఆయన అరెస్ట్‌పై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు. చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి బయటకొస్తారని, ధైర్యంగా ఉండాలని లోకేష్‌కు చెప్పారు. ఇక ఇటీవల తన సినిమా ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు అరెస్ట్ గురించి హీరో విశాల్ మాట్లాడాడు. చంద్రబాబు లాంటి వ్యక్తినే అరెస్ట్ చేసి జైలు పెట్టారని, ఆయనకే అలా జరిగితే సామాన్యులకు ఇంకెంత భయం ఉంటుందని వ్యాఖ్యానించాడు. టాలీవుడ్ నుంచి మాత్రం హీరోలెవ్వరూ స్పందించలేదు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వినీదత్, నట్టికుమార్, సురేష్ బాబు స్పందించారు.


మామ చంద్రబాబు అరెస్ట్ గురించి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నా స్పందించడా? అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భువనేశ్వరిపై వైసీపీ నేతలు అసభ్యకరమైన కామెంట్స్ చేసిన సమయంలో ఆచితూచి ట్విట్టర్‌లో ఎన్టీఆర్ స్పందించారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.