తమిళ దర్శకుడు పి.వాసు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో సంతాన భారతితో కలిసి నందమూరి బాలకృష్ణ హీరోగా 'సాహసమే జీవితం' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 'పృథ్వీ నారాయణ' 'మహారథి' 'కృష్ణార్జున' 'కథానాయకుడు' 'నాగవల్లి' వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆయన కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం 'చంద్రముఖి'. ఇందులో రజనీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించారు. 2005లో వచ్చిన ఈ హారర్ కామెడీ తెలుగు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దాదాపు 18 ఏళ్ళ తర్వాత దానికి సీక్వెల్ గా 'చంద్రముఖి 2' మూవీతో వస్తున్నారు వాసు.
కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి. వాసు దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'చంద్రముఖి 2'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని, సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నిజానికి ఈ మూవీని ముందుగా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పెండింగ్ ఉండటం వల్లనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీని వెనకున్న అసలు కారణాన్ని దర్శకుడు తాజాగా వెల్లడించారు.
‘చంద్రముఖి 2’ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమాని వాయిదా వేయడం గురించి పి. వాసు మాట్లాడారు. ''రఫ్ కట్ రెడీ చేసుకున్న తర్వాతే సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసాం. రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు 480 షాట్స్ ఫైల్స్ కనిపించడం లేదని నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను షాక్ అయ్యాను. ఏంటి.. ఇలా కూడా జరుగుతుందా? అనిపించింది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. దాదాపు 150 మంది టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. కొన్ని ఫైల్స్ కనిపించడం లేదు. అవి ఎక్కడ మిస్ అయ్యాయో తెలియదు. మేం గందరగోళ పరిస్థితిలో ఉండిపోయాం. అన్నీ మళ్ళీ కంప్లీట్ గా సెర్చ్ చెయ్యాలి. వాటిని వెనక్కి తీసుకురావడానికి మాకు నాలుగైదు రోజుల సమయం పట్టింది. ఏం చేయాలో తెలియక విడుదల వాయిదా వేశాం'' అని దర్శకుడు వివరించారు.
'చంద్రముఖి 2' రిలీజ్ అయ్యే వారంలోనే 'స్కంద' 'పెదకాపు 1' చిత్రాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. కాంపిటేషన్ ఉండాలని తాము ఎప్పుడూ కోరుకోలేదని పి. వాసు అన్నారు. క్లాష్ ఉండకూడదనే భావించామని, ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే మాకు కూడా ఇబ్బందే అవుతుంది. కావాలని ఇలా ప్లాన్ చెయ్యలేదు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాంపిటేషన్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నాం అని దర్శకుడు చెప్పుకొచ్చారు.
‘చంద్రముఖి 2’ కథను రజనీకాంత్ రిజెక్ట్ చేశారని వార్తలు రావడంపై స్పందిస్తూ.. ''ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ కథకు సంబంధించిన ఒక్క లైన్ కూడా రజనీకాంత్ కు తెలియదు. భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు ఆయనతో కలిసి మళ్లీ సినిమా చేస్తా'' అని పి. వాసు తెలిపారు. అంతేకాదు ‘చంద్రముఖి 3’ తీయడానికి అవకాశం ఉందని, అందుకు అనుగుణంగానే ఈ సినిమా చివర్లో వడివేలుతో ఓ డైలాగ్ చెప్పించామని వెల్లడించారు.
కాగా, 17 సంవత్సరాల క్రితం చంద్రముఖిని బంధించిన బంగ్లాలోకి ఒక ఫ్యామిలీ అడుగుపెడితే, వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చంద్రముఖి తన 200 ఏళ్ల నాటి పగకు ప్రతీకారం తీర్చుకుందా లేదా? అనేది 'చంద్రముఖి 2' కథాంశంగా తెలుస్తోంది. మొదటి భాగంలో నటించిన వడివేలు తప్ప మిగతా ప్రధాన పాత్రధారులు ఎవరూ ఈ సీక్వెల్ లో నటించలేదు. ఇందులో రాధిక శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేష్, శత్రు కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రిలీజ్ చేయనున్నారు.
Also Read: సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial