ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు తన సంగీత సారధ్యంలో ఎన్నో మరుపురాని సూపర్ హిట్ పాటలను అందించిన ఈయన.. హైదరాబాద్లోని కూకట్ పల్లి లోని తన నివాసంలో తొలి శ్వాస విడిచారు. ఇక ఆయన మరణం పై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇక రాజ్ మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాజ్ మరణం పట్ల తమ సంతాపాన్ని ప్రకటించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అందజేశారు. కాగా సోమవారం ఉదయం రాజ్ అంతిమయాత్ర ప్రారంభమవగా.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. సినీ పరిశ్రమ తరఫునుంచి కాశీ విశ్వనాథ్, శివాజీ రాజా, నల్లమల్లపు బుజ్జి, జయంత్, కోటి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.


ఇక మహాప్రస్థానంలో కొద్దిసేపటి క్రితమే రాజ్ అంత్యక్రియలు ముగిసాయి. ఆయన పెద్దల్లుడు కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.  సంగీత దర్శకుడు  కోటి.. తన మిత్రుడి భౌతికకాయాన్ని చూసి విలవిలలాడిపోయారు. తన మిత్రుని చివరి చూపు చూసుకొని తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్  మీడియాలో అభిమానులను సైతం కదిలిస్తున్నాయి. ఇక రాజ్ - కోటి ఇద్దరూ కలిసి తమ సంగీత సారధ్యంలో ఎన్నో మరుపురాని పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రధానంగా 90ల్లో  తమ సంగీతంతో సినీ ఇండస్ట్రీ ఓపు ఊపేశారు. ఇద్దరూ కలిసి సుమారు 180 కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కోటి నుండి విడిపోయిన రాజ్.. తర్వాత సొంతంగా సుమారు పది సినిమాలకు పైగా సంగీతం అందించారు. ఆ తర్వాత ఆ కెరీర్‌ను విడిచిపెట్టారు.


ఇక రాజ్ అసలు పేరు 'తోటకూర సోమరాజు'. అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజ్ కొడుకే ఈ రాజ్. ఈయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక సంగీత దర్శకుడిగా 'ప్రళయ గర్జన' అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాజ్ ఆ తర్వాత కోటితో కలిసి అగ్ర హీరోల సినిమాలకు సంగీతమందించాడు. వీరి ద్వయం లో వచ్చిన 'ముఠామేస్త్రి', 'గోవిందా గోవిందా', హలో బ్రదర్, 'బావబామ్మర్ది'  వంటి సినిమాలు వీరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక కోటి నుంచి విడిపోయిన తర్వాత రాజ్ 'సిసింద్రీ', 'భరత సింహం', 'రాముడొచ్చాడు', 'మృగం', 'బొబ్బిలి బుల్లోడు',సం'భవం', 'చిన్ని చిన్ని ఆశ', 'లగ్నపత్రిక' వంటి సినిమాలకు సోలోగా సంగీతం అందించారు. అంతేకాదు విక్టరీ వెంకటేష్ నటించిన 'ప్రేమంటే ఇదేరా' సినిమాకు ఆయన నేపథ్య సంగీతం కూడా అందించారు. ఇక సంగీతంతో పాటు పలు సినిమాల్లో అతిథి పాత్రలోనూ మెరిసిన రాజ్ చివరగా 'లగ్నపత్రిక' అనే సినిమాకి సంగీతం అందించారు.


Also Read: Sarath Babu: టాలీవుడ్ దిగ్గజ నటుడు శరత్ బాబు ఇకలేరు