మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో మరో సినిమా రానుంది. 'డర్టీ హరి'తో దర్శకుడిగా భారీ విజయం అందుకున్న ఆయన, ఆ తర్వాత '7 డేస్ 6 నైట్స్' తీశారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మదర్స్ డే సందర్భంగా ఈ రోజు కొత్త సినిమా 'సతి' (MS Raju Sathi Movie) ప్రకటించారు.


'సతి' చిత్రాన్ని ప్రకటించడంతో పాటు ప్రీ లుక్ విడుదల చేశారు. అది (Sathi Movie Pre Look) చూస్తే... ఓ యువ జంట గడప దాటడం (ఇంట్లో అడుగు పెట్టడం) కనిపిస్తుంది. వారి వెనుక జాతర జరుగుతున్న వాతావరణం ఉంది. వివాహ బంధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు ఉన్నారు. ప్రేమ, పెళ్లి గురించి ఎంఎస్ రాజు ఈసారి ఏం చెప్పబోతున్నారో? మే 10న (మంగళవారం) ఉదయం 11.11 గంటలకు 'సతి' ఫస్ట్ లుక్ (Sathi Movie First Look) విడుదల చేయనున్నారు. ఆ రోజే హీరో హీరోయిన్లు, ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. 






సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై వైల్డ్ హానీ ప్రొడక్షన్, రామంత్ర క్రియేషన్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. సుమంత్ అశ్విన్, రఘురామ్ టి, సారంగ సురేష్ కుమార్, డాక్టర్ రవి దాట్ల నిర్మాతలు. జె శ్రీనివాస రాజు కో ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి జునైద్ సిద్ధిఖీ ఎడిటర్.


Also Read: 'ది వారియర్' టీజర్‌తో రానున్న రామ్, ఊర మాస్ విజువల్స్ చూడటానికి రెడీనా?


'మనసంతా నువ్వే ', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'పౌర్ణమి' వంటి భారీ చిత్రాలు ఎంఎస్ రాజు నిర్మించారు. ఆ సినిమాలను గమనిస్తే... వాటిలో కథానాయికలు, మహిళల పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. దర్శకుడిగా ఎంఎస్ రాజు రూపొందించిన 'డర్టీ హరి'లోనూ హీరోయిన్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. 'సతి' కూడా అలాగే ఉంటుందట.


Also Read: కాజల్ అగర్వాల్ కుమారుడిని చూశారా? ఫస్ట్ ఫొటో బయటకు వచ్చేసింది!