Mrunal Thakur At Family Star Pre Release Event: ‘సీతారామం’తో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే సీతగా అందరి మనసులను గెలిచేసుకుంది. ఆ తర్వాత చేసిన ‘హాయ్ నాన్న’ చూసిన ఆడియన్స్ అంతా మృణాల్ స్క్రిప్ట్ సెలక్షన్‌కు ఫిదా అయ్యారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి ‘ఫ్యామిలీ స్టార్’తో థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తుంది ఈ భామ. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవ్వగా హీరో విజయ్ దేవరకొండతో పాటు మృణాల్ కూడా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా జరిగిన ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్ చేసిన పనికి ప్రేక్షకులు షాకయ్యారు.
మోకాళ్లపై కూర్చొని మరీ..
‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముందుగా తెలుగు ఆడియన్స్‌ను తెలుగులోనే పలకరించింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వారి కోసం ఒకటి చేయాలని అనుకుంటున్నానని చెప్పి.. మోకాళ్లపై కూర్చొని అందరికీ తలవంచి నమస్కరించింది. ఇది చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇలా చేయలేదని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా తనను ఇంతగా ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ‘‘చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మీరంతా కలిసి నన్ను మీ తెలుగమ్మాయిని చేశారు. ఈరోజు నాకెంత స్పెషల్ రోజు అని మాటల్లో చెప్పలేను’’ అంటూ తన సంతోషాన్ని బయటపెట్టింది మృణాల్.
నేను మాత్రమే చేయగలను..
‘‘సీతారామం, హాయ్ నాన్న, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. నన్ను పక్కకు పెట్టకుండా ఈ సినిమాలో క్యాస్ట్ చేసుకున్నందుకు పరశురామ్‌కు థాంక్యూ. మొదటి 15 రోజులు కష్టంగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత నా మైండ్‌కు, నా మనసుకు తెలిసిపోయింది ఇందు అనే పాత్రకు నాలాగా ఎవరూ చేయలేరు అని. నాకు ఇందు అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం నాకు ఇష్టం. ప్రతీ అమ్మాయికి రౌడీ విజయ్‌తో కలిసి వర్క్ చేయాలని డ్రీమ్ ఉంటుంది’’ అంటూ తనతో సినిమాలో కలిసి పనిచేసిన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా గుర్తుచేసుకుంది. ఇది తనకు చాలా అందమైన ప్రయాణమని చెప్పుకొచ్చింది. దిల్ రాజుతో కలిసి ఇప్పటికీ రెండు సినిమాలు చేశానని, మరో సినిమా కూడా చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టింది.
మాటివ్వండి..
కళ్యాణి వచ్చా వచ్చా పాటకు వస్తున్న క్రేజ్‌పై కూడా మృణాల్ ఠాకూర్ స్పందించింది. తను మొదటిసారి ఇలాంటి పాటలో నటించానని, స్టెప్పులేశానని, దానికి వస్తున్న రెస్పాన్స్ తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది. తన తండ్రి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాగా.. తనతో కలిసి ఈ స్పెషల్ రోజును సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది మృణాల్. ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు అందరూ ఫ్యామిలీతో వెళ్లాలని ఫ్యాన్స్ దగ్గర మాట తీసుకుంది. అందరికీ మనస్ఫూర్తిగా లవ్ యూ అని చెప్తూ తన స్పీచ్‌ను ముగించింది. ఫైనల్‌గా అందరినీ ఏవండి అని పిలిచి సంతోషపెట్టింది మృణాల్ ఠాకూర్.
Also Read: 'ఫ్యామిలీ స్టార్' సెన్సార్ రిపోర్ట్ - ఆ నాలుగు డైలాగులూ మ్యూట్!