Star Heroes Participated In WAVES Summit 2025: మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ ఇలా దేశంలోని స్టార్లు, హీరోయిన్లు ఒకే వేడుకలో సందడి చేశారు. ముంబయి వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రతిష్టాత్మక 'వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్' గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది.
ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
'కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్' అనే ట్యాగ్ లైన్‌తో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని సినీ ఇండస్ట్రీ, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'వేవ్స్' (Waves 2025) కార్యక్రమానికి నాంది పలికింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం యాక్టర్స్, కళాకారుల సేవలను కొనియాడారు. ఆరెంజ్ ఎకానమీకి దేశంలో నాంది పడిందని అన్నారు.
త్వరలోనే వేవ్స్ అవార్డులు
క్రియేటివిటీని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో త్వరలోనే 'వేవ్స్' అవార్డులను ప్రవేశపెట్టనున్నట్లు మోదీ వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వీటిని అందించనున్నట్లు తెలిపారు. 'భారత్‌లోని 6 లక్షల గ్రామాల్లో ప్రతీ వీధి ఓ కథ చెబుతుంది. మన దేశంలోని ప్రతి పర్వతం ఓ పాట పాడుతుంది. ప్రతి నదీ ఓ గేయం ఆలపిస్తుంది. మన దేశం విభిన్న సమాజాల సమాహారం. 'వేవ్స్' అనేది కేవలం కొన్ని అక్షరాల సమూహం మాత్రమే కాదు. సంస్కృతి, సృజనాత్మకత, సార్వత్రిక అనుసంధానం. భారత్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారుతోంది. క్రియేటివిటీ కేంద్రంగా తయారై కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి. క్రియేటివిటీ ఉన్న యూత్ దేశానికి అసలైన ఆస్తి. కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తాం.' అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా సత్యజిత్ రే, రాజ్ కపూర్, రాజమౌళి, ఏఆర్ రెహమాన్, చిరంజీవి వంటి వారిని ప్రశంసించారు.
స్టార్ హీరోస్ గ్రూప్ ఫోటో
ఈ కార్యక్రమంలో సీనియర్ హీరోలు, హీరోయిన్లు, స్టార్ హీరోలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ పాల్గొన్నారు. చిరంజీవి, రాజమౌళి, రజినీకాంత్, మోహన్ లాల్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె, ప్రియాంకచోప్రాతో, రాజమౌళి, ఆలియా, అమీర్ ఖాన్‌లతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి, మోహన్ లాల్, రజినీకాంత్, హేమమాలిని, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి కలిసి ఓ ఫోటో దిగారు. చాలా రోజుల తర్వాత హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఆ పిక్ వైరల్‌గా మారింది. సూపర్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం బుధవారమే చిరంజీవి ముంబయి చేరుకున్నారు.