ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రోజు మరో క్రేజీ పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్నారు. భారీ స్థాయిలో సినిమాలు నిర్మిస్తూ, సినిమాల పట్ల మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఓ భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ తెరపైకి రాబోతోంది. ఈ సినిమాకు 'మార్కో' డైరెక్టర్ హనీఫ్ అదేని దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. 


'మార్కో' డైరెక్టర్ తో దిల్ రాజు పాన్ ఇండియా ప్లాన్ 
ఇటీవల మలయాళంలో రిలీజై, బ్లాక్ బస్టర్ గా నిలిచిన యాక్షన్ ఎంటర్టైనర్ 'మార్కో'. ఈ మూవీతో డైరెక్టర్ హనీఫ్ అదేని పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ డైరెక్టర్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. శిరీష్ ఈ సినిమాను సమర్పిస్తుండగా, అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ గా ప్రాజెక్ట్ తెరపైకి రాబోతోంది. ఇంకా ఈ మూవీకి టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాకు హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 


ఇక డైరెక్టర్ హనీష్ విషయానికి వస్తే... 'మార్కో' సినిమాలో ఆయన ఊహించని మాస్, యాక్షన్, వయోలెన్స్ యాంగిల్ ని తెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరంగా మారింది. గురు ఫిలిమ్స్ సునీత తాటి ఈ ప్రాజెక్టులో భాగస్వామి కాగా, త్వరలోనే మరిన్ని వివరాలను అనౌన్స్ చేయబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అప్పుడే ప్రాజెక్టుపై అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ సినిమాలో నటించబోయే ఆ ఇద్దరు హీరోలు ఎవరు? హీరోయిన్లుగా నటించే అదృష్టం ఎవరిని వరిస్తుంది? మూవీ టైటిల్ ఏంటి? అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. 


'మార్కో' టెలివిజన్ ప్రీమియర్ బ్యాన్ 
ఇదిలా ఉండగా, హనీఫ్ దర్శకత్వం వహించిన 'మార్కో' మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీలో వయోలెన్స్ ఎక్కువగా ఉందనే కారణంతో టీవీ ప్రీమియర్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దిల్ రాజు 2025 పొంగల్ కి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదే జోష్ తో ఆయన మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మార్చ్ 1 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇదే డేట్ కి మూవీ టెలివిజన్ ప్రీమియర్ కూడా అయ్యిందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ మూవీ జీ తెలుగు టీఆర్పి రేటింగ్ ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది.