'కన్నప్ప' విడుదల సాక్షిగా మంచు కుటుంబంలో కలహాలు మరోసారి బయట పడ్డాయి. అన్నదమ్ములు విష్ణు మనోజ్ మధ్య దూరం తగ్గలేదని మరోసారి తెలిసింది. జూన్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో 'కన్నప్ప' చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ మనోజ్ ఒక ట్వీట్ చేశారు. అందులో విష్ణు పేరు లేదు. ఆయన షేర్ చేసిన ఫోటోల్లో విష్ణు పోస్టర్ కూడా లేదు. అన్నయ్యను వదిలి ఆయన పిల్లల ఫోటోలు షేర్ చేయడం విశేషం.
తనికెళ్ల భరణి చిరకాల కోరిక తెరపైకి వస్తోంది...సినిమాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్!'ఆల్ ద బెస్ట్ టూ టీం కన్నప్ప' అంటూ గురువారం మధ్యాహ్నం మంచు మనోజ్ ట్వీట్ చేశారు. అందులో అన్నయ్య విష్ణుకు ఆగ్రహం తెప్పించేలా రాసుకొచ్చారు.
తనికెళ్ల భరణి దర్శకత్వంలో 'కన్నప్ప'ను చేయాలని అనుకున్నా... ఆ తరువాత స్వయంగా తానే కథ రాశానని విష్ణు మంచు తెలిపారు. ఈ రోజు మనోజ్ మరోసారి తనికెళ్ల భరణిని గుర్తు చేశారు. తనికెళ్ల చిరకాల జీవిత కోరిక వెండితెరపైకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మనోజ్ పేర్కొన్నారు.
తన తండ్రి మోహన్ బాబుతో పాటు చిత్ర బృందమంతా ఏళ్లపాటు కష్టపడి ఈ సినిమా చేశారని, బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నానని మనోజ్ తెలిపారు. అరియానా - వివియానాతో పాటు అవ్రామ్ (విష్ణు మంచు తనయుడు)ను తెరపై చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. విష్ణు పిల్లల పేర్లు పేర్కొన్న మనోజ్... విష్ణు గురించి ఒక్క మాట కూడా ట్వీట్ చేయలేదు.
బంగారు మనసున్న ప్రభాస్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా... సినిమాకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి మనోజ్ థాంక్స్ చెప్పారు. పరమేశ్వరుని ఆశీస్సులతో సినిమా భారీ విజయం సాధించాలని మనోజ్ ఆకాంక్షించారు. ఆయన చేసిన ట్వీట్ పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. విష్ణును కావాలని స్కిప్ చేశాడని కొందరు, ఏది ఏమైతేనే విషెస్ చెప్పాడు కదా అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.