Manmadhudu Heroine Anshu: కొందరు హీరోహీరోయిన్లు.. కొన్ని సినిమాలతో తక్కువ టైమ్‌లోనే ఫేమ్ సంపాదించుకొని ఆ తర్వాత వెండితెరపై నుండి కనుమరుగయిపోతారు. కానీ వారు చేసిన సినిమాలను, ఆ పాత్రలను మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వాటిలో ఒకటి ‘మన్మథుడు’ సినిమాలో మహీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేసింది ఎవరు, తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి చాలామందికి తెలియకపోయినా.. ఈ క్యారెక్టర్ మాత్రం చాలామందికీ ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇక తాజాగా ఈ పాత్ర పోషించిన అన్షు.. చాలాకాలం తర్వాత ప్రేక్షకులతో మాట్లాడడానికి ముందుకొచ్చింది. ఈ సందర్భంగా తను సినిమాలు ఎందుకు మానేసిందో బయటపెట్టింది.


చివరి సినిమా అదే..


‘మన్మథుడు’, ‘రాఘవేంద్ర’లాంటి తెలుగు సినిమాల్లో నటించిన తర్వాత అన్షు పూర్తిగా వెండితెరపై కనిపించడం మానేసింది. పెళ్లి చేసుకొని ఫారిన్‌లో సెటిల్ అయిపోయింది. తాజాగా తన పాల్గొన్న ఇంటర్వ్యూలో ముందుగా తను సినిమాలు ఎందుకు మానేసిందో చెప్పుకొచ్చింది. ‘‘దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను చాలా సంతోషంగా ఉంది. నేను చివరిగా 20 ఏళ్ల క్రితం ఒక తమిళ సినిమా చేశాను. అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ చేస్తూ ఉన్నాను. కానీ చివరి సినిమా మాత్రం అదే’’ అని గుర్తుచేసుకుంటూ తను సడెన్‌గా సినిమాల్లో నుండి మాయం అయిపోవడంపై స్పందించింది అన్షు. ‘‘నేనెక్కడికి వెళ్లిపోయాను, ఏమైంది అని ప్రేక్షకులు చర్చించుకోవడం చూశాను. అంతే కాకుండా నేను చనిపోయానని కూడా రూమర్స్ వచ్చాయి’’ అంటూ తనపై వచ్చిన రూమర్స్ గురించి చెప్తూ బాధపడింది.


ఎన్నో అవకాశాలు వచ్చాయి..


‘‘నేను చనిపోయానని వచ్చిన రూమర్స్ చదవాలంటే భయమేసేది. అసలు ఎందుకు నేను సినిమాలను వదిలేశాను అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. ఎందుకలా జరిగింది అని ఆలోచించేదాన్ని. కానీ ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు ఉన్నాయి. నేను అప్పటికీ చాలా చిన్నపిల్లని. అప్పుడే ఇంగ్లాండ్ నుండి ఇండియాకు షిఫ్ట్ అయ్యాను. ‘మన్మథుడు’లో నాగార్జునతో నటించే అద్భుతమైన అవకాశం లభించింది. అదంతా మంచి టీమ్, కల నిజం అయినట్టు అనిపించింది. సినిమాల్లో యాక్టివ్ అవ్వాలి, అదే నా తరువాతి అడుగు అనుకున్నాను. కానీ చిన్న వయసు కాబట్టి ముందుగా చదువుపై ఫోకస్ పెట్టాలి అనుకున్నాను. మన్మథుడు సినిమా చేస్తున్నప్పుడు నా వయసు 16 ఏళ్లే. సినిమా బాగా నడిచింది. దాని తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. అనుకున్న దానికంటే ఎక్కవ సమయమే ఇక్కడ ఉండిపోయాను’’ అంటూ ముందుగా ‘మన్మథుడు’ విశేషాలను పంచుకుంది అన్షు.


తండ్రి వల్లే..


‘‘ఇంగ్లాండ్ నుండి హైదరాబాద్‌కు రావడం, ఇక్కడ ఉండడం చాలా కష్టం అనిపించింది. అంతకంటే ముందు నేనెప్పుడూ రాలేదు. అప్పట్లో మ్యానేజర్స్, పీఆర్స్ అనేవారు ఎక్కువగా లేరు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. నాతో నా తండ్రి మాత్రమే ఉండేవారు. అప్పటికీ నేను చిన్నపిల్లను కాబట్టి ప్రతీ విషయంలో అతిజాగ్రత్త తీసుకునేవారు. సినిమాల్లోకి రాకముందు ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్తానంటే ఏం అనేవారు కాదు.. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని కలవాలి అనే ఆంక్షలు వచ్చేశాయి. ఎవరైనా నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ముందుగా నా తండ్రిని కలవాల్సి వచ్చేది. చాలా ఆంక్షలు ఉండేవి. దీని బదులు వెనక్కి వెళ్లిపోవడం బెటర్‌ అనిపించింది. తర్వాత వద్దాంలే అనుకున్నాను ఇన్నేళ్లు గడిచిపోయింది’’ అని అసలు విషయాన్ని బయటపెట్టింది అన్షు. చివరిగా తను కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.


Also Read: సూర్య 'కంగువా' హంగామా.. డబ్బింగ్ మొదలైంది!